అందుకే 'ఈగ' అంత పెద్ద హిట్: రాజమౌళి
హైదరాబాద్ : రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' . కేవలం ఈగనే ప్రధాన పాత్రలో పెట్టి రూపొందించిన ఈ చిత్రం మంచి విజయవంతమైంది. దానికి కారణం కథేనని ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ వివరించారు. ఆయన మాట్లాడుతూ...కథలో బలం ఉండి కథ చెప్పే టెక్నిక్‌ను సరిగా అనుసరించినట్లయితే చిత్రం ఏదైనా విజయవంతమవుతుందని అన్నారు. 'ఈగ' చిత్రం ఇంతగా విజయవంతమవుతుందని తాను ఊహించలేదన్నారు. గ్రాఫిక్స్ అనేవి ఎప్పటినుంచో చిత్రసీమలో ఉన్నాయని కాని ఇపుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అమలులోకి వచ్చిందని అన్నారు.
అలాగే కేవలం పిల్లల కథ మాదిరి కాకుండా 'ఈగ' చిత్రంలో మానవీయకోణం ఉందన్నారు. ఒక మనిషి ఈగగా పునర్జన్మ పొందినపుడు పాతజన్మ సంబంధిత జ్ఞాపకాలతో ముందుకు పోవటం కథాంశమన్నారు. ఇందుకు 3 డి ఇమేజెస్‌ను విస్తృతంగా వినియోగించామని తెలిపారు. ఒక ఈగను చిత్రంలో ప్రధానపాత్రధారిగా మలచి చిత్ర నిర్మాణం జరగటం బహుశా ఇదే ప్రథమమన్నారు. ప్రస్తుతం హీరో చుట్టూ చిత్ర కథ సాగుతోందని అలా కాక వైవిధ్యంతో ఒక ఈగను ప్రధానంగా చేసి చిత్ర నిర్మాణం చేయటం సాహసమేనన్నారు.
అయితే ప్రేక్షకులు కథ బలంగా ఉంటే కొత్త హీరోలు లేదా హీరోయిన్స్ ను అయినా ఆదరిస్తారని అన్నారు. మూసకథ, కథనాలు కాకుండా వైవిధ్యానికి వారు పెద్దపీట వేస్తారనటానికి 'ఈగ' చిత్ర విజయమే నిదర్శనమన్నారు. 1990లలో తన తండ్రి ఒక ఈగ గురించి చెప్పిన కథ తన మనసులో బలంగా నాటుకుపోయిందన్నారు. ఈ చిత్ర నిర్మాణానికి అదే ఆద్యమని చెప్పారు. 2004 తర్వాతే ఈ ప్రాజెక్ట్ అమలు ప్రారం భమై ఇప్పటికి సాకారమైందన్నారు. ఎప్పటిలా మామూలు చిత్రాల మాదిరి కాకుండా భిన్నమైన కథాంశంతో చిత్రాన్ని నిర్మించాలన్న కోరిక ఇప్పటికి నెరవేరిందన్నారు.
చిన్న బడ్జెట్ అనుకున్న సినిమా అంచనాల అవధులు దాటిందన్నారు. ఇప్పుడు తాను చేసిన ప్రయోగం అందరికీ తెలిసిన జలమార్గాల గుండా కాకుండా వినూత్నమైన సముద్ర జలాల ద్వారా నౌకను నడిపించటం లాటిదని చెప్పారు. అయితే లిట్మస్ పరీక్షలో తాను విజయవంతమైనట్లు తెలిపారు. ఇపుడు విఎఫ్‌ఎక్స్ టెక్నాలజీ బాగా ప్రాచుర్యంలో ఉందన్నారు. ఇది రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోందన్నారు. ఇంకా సాధించవలసింది ఎంతో ఉందన్నారు.


Click it and Unblock the Notifications











