‘విశ్వరూపం’ డిటిహెచ్ రిలీజ్ వివాదం ముగిసింది, 4రోజుల తర్వాత!
చెన్నై: విశ్వరూపం చిత్రం డిటిహెచ్ రిలీజ్ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. కమల్ హాసన్, తమిళనాడు థియేటర్ల ఓనర్ల మధ్య రాజీ కుదిరింది. ఈ మేరకు సినిమాను జనవరి 25న విడుదల చేయాలని, సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు రోజుల తర్వాత(జనవరి 28న) డిటిహెచ్ ద్వారా సినిమాను నేరుగా టీవీల్లో ప్రసారం చేయాలనే నిర్ణయాన్ని ఇరు వర్గాలు ఆమోదించాయి. దీంతో వివాదం కాస్త సద్దుమనిగినట్లయింది.
థియేటర్ల కంటే ముందే 'విశ్వరూపం' చిత్రాన్ని డిటిహెచ్ లో రిలీజ్ చేయడాన్ని అడ్డుకునేందుకు తమిళనాడు థియేటర్ల అసోసియేషన్ తమ శక్తి మేర ప్రయత్నించిన సంగతి తెలిసిందే. డిటిహెచ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే సినిమాకు తమిళనాడులో ఒక్క థియేటర్ కూడా కేటాయించబోమని ఇప్పటికే హెచ్చరించారు. థియేటర్ల కంటే ముందే నేరుగా టీవీల్లో సినిమాను రిలీజ్ చేస్తే థియేటర్లకు వచ్చి చూసే వారి సంఖ్య తగ్గుతుందని, తద్వారా తమ తీవ్రంగా నష్టపోతామని, డీటీహెచ్ రిలీజ్ సాంప్రదాయం మొదలైతే... ఇకపై అన్ని సినిమాలు అదే దారి పడతాయని, క్రమ క్రమంగా థియేటర్లు బిజినెస్ డీలా పడిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేసారు.
అయితే కమల్ హాసన్ మాత్రం థియేటర్ల యజమానుల వాదనను కొట్టి పారేస్తూ వచ్చారు. డిటిహెచ్ రిలీజ్ ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా ప్రోత్సహిస్తుందని, డిటిహెచ్ రిలీజ్ వల్ల సినిమా థియేటర్లకు వచ్చిన నష్టం ఏమీ లేదని ఆయన అంటున్నారు. డిటిహెచ్ రిలీజ్ అనేది సినిమాలకు కొత్త ఆదాయ వనరుగా మారుతుందని, అదే సమయంలో థియేటర్ల ఆదాయానికి ఎలాంటి ఆటకం కలగదని అంటూ వాదించారు. చివరకు ఇరు వర్గాలు రాజీకి వచ్చి సినిమా విడుదలైన నాలుగు రోజుల తర్వాత డిటిహెచ్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. సినిమాను డిటిహెచ్ లో చూడాలనుకునే వారు తమిళంలో అయితే రూ. 1000, హిందీ, తెలుగులో అయితే రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వరూపం చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు.


Click it and Unblock the Notifications











