హైదరాబాద్‌లో ‘విశ్వరూపం’ ప్రదర్శన నిలిపివేత
హైదరాబాద్ : కమల్ హాసన్ విశ్వరూపం చిత్రానికి హైదరాబాద్ లో కూడా బ్రేక్ పడింది. ఈ మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసారు. ఈ రోజు ముస్లింల పండగ 'మిలాద్ ఉన్ నబి ' ఉండటం, విశ్వరూపం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని పలు ముస్లిం సంఘాలు నేతలు సబితా ఇంద్రారెడ్డిని కలిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం 'విశ్వరూపం' ప్రదర్శన నిలిపి వేసినట్లు తెలుస్తోంది.
కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు.
విశ్వరూపం చిత్రంపై తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తున్న విశ్వరూపం చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు కమల్ హాసన్ మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయంపై స్టే విధించి సినిమా విడుదలయ్యేలా చూడాలని ఆయన కోర్టును కోరారు. అయితే కమల్ కు కోర్టులో చుక్కెదురైంది. ఈ నెల 28 వరకు బ్యాన్ కొనసాగిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నెల 26వ తేదీన న్యాయమూర్తి చూడనున్నారు. తన ఆదేశాలు తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే పరిమితమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











