అమీర్ ఖాన్ 'పిప్లీలైవ్'ను నిషేధించండి
మొన్న శుక్రవారం రిలీజైన ఆమిర్‌ఖాన్ 'పిప్లీలైవ్' చిత్రం నిషేధించాలంటూ ఓ వివాదం మొదలైంది. నిర్మాతగా తెరకెక్కించిన 'పిప్లీలైవ్' సినిమాను నిషేధించాల్సిందిగా విదర్భ జనాందోళన్ సమితి ప్రభుత్వాన్ని కోరింది. విదర్భ రైతుల ఆత్మహత్యలపై చిత్ర వైఖరిని అది తప్పుబట్టింది. చిత్రీకరించిన విధానాన్ని వ్యతిరేకించింది. రుణమాఫీ కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పడమేకాకుండా రైతుల ఆత్మహత్యల అంశం అంత తీవ్రమైనది కాదన్న రీతిలో చిత్ర కథ సాగిందని సమితి అధ్యక్షుడు కిషోర్ తివారీ ఆరోపించారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు.
రుణాలను తీర్చేందుకోసం రైతులు తమ కూతుళ్ళను అమ్ముకున్నట్లుగా టీవీ సీరియల్ 'బైరీ పియా' చూపించగా అందుకు విరుద్ధంగా 'పిప్లీలైవ్'లో చూపించడం రైతులను అవమాన పర్చడమేనన్నారు. గ్లోబలైజేషన్ పేరుతో తప్పుడు విధానాలను అనుసరిస్తూ రైతు బతుకును కాటికీడుస్తున్న ప్రభుత్వాలదే ఈ తప్పంతా అని ఆయన లేఖలో పేర్కొన్నారు. నిర్మాత ఆమిర్‌ఖాన్ స్క్రిప్ట్‌ను తయారు చేసుకునేటప్పుడే నిపుణులను సంప్రదించాల్సిందని, భర్తల ఆత్మహత్యలతో వితంతువులుగా మారిన మహిళలకు పరిహారం చెల్లించే అంశాన్ని సినిమా ప్రశ్నార్థకం చేసిందని సమితి ఆరోపించింది. కాగా ఖాన్ సంస్థ తరఫు ప్రతినిధులు మాట్లాడుతూ...తమ చిత్రం రైతుల ఆత్మహత్యల నేపథ్యంతో తీసింది కాదని తెలిపారు.
జర్నలిస్టుగా ఉన్న అనూష రిజ్విని దర్శకత్వంలో అమీర్ ఖాన్ 'పీప్లి లైవ్' అనే సినిమాను నిర్మించారు. రైతుల ఆత్మహత్యలు..రాజకీయ నాయకుల ఓదార్పులు..వాటిపై మీడియా కథనాలు..వీటి చుట్టూ అల్లుకొన్న కథ ఇది. ఈ నెల 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ సినిమాను 200 ప్రింట్లతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో రఘుబీర్ యాదవ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మలైకా షెనాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











