బుల్లితెరపై వైజయంతీ విలాసం
ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన, భారీ బడ్జెట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన వైజయంతీ మూవీస్ పతాకం ఇప్పుడు బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది. వైజయంతీ అధినేత సి. అశ్వినీదత్ కుమార్తె స్వప్నా దత్ నేతృత్వంలో వైజయంతీ టెలీ వెంచర్స్ (విటివి) కార్యక్రమాలను ఇటీవల హైదరాబాద్‌లో ప్రకటించారు. టీవీ మాధ్యమంలో దాదాపు 50 కార్యక్రమాలను రూపొందించే ప్రక్రియలో భాగంగా విటివి సరిగమప సంగీత కార్యక్రమం ద్వారా తొలి అడుగు వేస్తోంది.
వైజయంతీ పతాకంలో నిర్మితమైన చిత్రాలు చాలా వరకూ హిట్లు, కొన్ని మాత్రం ఫ్లాపులు. అయితే, అన్ని చిత్రాలలోనూ సంగీతానికి మాత్రం చాలా ప్రాధాన్యం ఉంది. సరిగమప కూడా సంగీత ప్రధానంగా సాగే కార్యక్రమం. కొత్త గాయనీ గాయకులకు తమ ప్రతిభా పాటవాలను చాటుకునేందుకు ఇది సరైన వేదిక అవుతుందని విటివి అధినేత స్వప్నా దత్ వెల్లడించారు.
నవంబర్ 2 నుంచి జీ తెలుగులో ప్రతి గురువారం, శనివారం రాత్రి 9 గంటలకు సరిగమప కార్యక్రమం ప్రసారం అవుతుంది. 35 ఎపిసోడ్లు ఉండే ఈ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులకు చేరువ అవుతుందని సప్నాదత్ ఆకాంక్షించారు.
విటివి లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత-దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి, ఆనందసాయి, రిథమ్ విష్ణు, సునీత, జీ తెలుగు ప్రతినిధి అజయ్ కుమార్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications