సంక్రాంతికి థియేటర్లు కావలెను
సంక్రాంతి, ఉగాదికి విడుదల అయిన సినిమాలు వందరోజులు ఆడతాయని తెలుగు పరిశ్రమ నమ్మకం. ఈ నమ్మకంతోనే ఈ సంక్రాంతికి తమ తమ సినిమాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు, హీరోలు. ఈ వరుసలో చాలా సినిమాలే ఉన్నాయి.
ఆ వరుసలో మోహన్ బాబు తన కుమారుడు విష్ణు హీరోగా తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఉంది. ఈ సినిమాకు పేరు పెట్టాలని ఆయన ప్రేక్షకులకు పోటీ నడుపుతున్నాడు కూడా. ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాను జనవరి 14న అంటే సంక్రాంతి రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
నాగార్జున హీరోగా రూపొందుతున్న డాన్ సినిమాను కూడా సంక్రాంతి రోజున విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ లోనే విడుదల చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ సాంకేతిక కారణాలవలన దానిని సంక్రాంతికి వాయిదా వేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం జల్సా. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్నఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని చానాళ్ల క్రితమే ప్రకటించారు.
ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తొలిసారి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం వాన ను జనవరి 15న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని కూడా సంక్రాంతి విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఒక్క మగాడు సినిమాను కూడా సంక్రాంతి పర్వదినాన్నే విడుదల చేయనుండడం విశేషం.
పైన పేర్కొన్న ఈ సినిమాలే కాకుండా ఇంకా మరికొన్ని సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఒకే సినిమాను చాలా థియేటర్లలో విడుదల చేసే తెలుగు నిర్మాతలు మరి ఇన్ని సినిమాలను ఒకేసారి విడుదల చేస్తే థియేటర్లు సరిపోతాయోలేదో చూడాలి.


Click it and Unblock the Notifications











