శ్రీరామ రాజ్యం సినిమాపై హెచ్చార్సీని ఆశ్రయించిన రజక సంఘం
మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న బాలయ్య తాజా సినిమా 'శ్రీరామ రాజ్యం" సినిమాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం నాయకులు మంగళవారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పోషించిన 'చాకలి తిప్పడు" పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. ఈ పాత్ర రజకులను అవమానించే విధంగా ఉందనే అనుమానం వ్యక్తం చేస్తూ, వెంటనే ఆ పాత్రను తొలగించాలని, ఆ తర్వాతే సినిమా విడుదలయ్యే విధంగా ఆదేశాలు జారీ చేయాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. చాకలి తిప్పడు పాత్రను తొలగించక పోతే రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఆందోళన చేస్తారని, సినిమాను అడ్డుకుంటామని ఇది వరకే రజక సంఘం హెచ్చరించింది.
బాలయ్య రాముడి పాత్రలో, నయన తార సీత పాత్రలో నటించిన శ్రీరామ రాజ్యం సినిమా ఈ నెల 17 విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమా గతంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'లవకుశ" సినిమా ఆధారంగా రూపొందినట్లు తెలుస్తోంది. యలమంచిలి సాయిబాబు నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇలయరాజ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలై పాటలు మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











