వైసీపీ వ్యవస్ధాపకుడెవరు .. ముందు సొంత పార్టీ పెట్టన్నా, జగన్‌పై మామూలు ట్రోలింగ్ కాదుగా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. 11 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. జగన్ ఓడిపోవాలని, ఓడిపోతాడని కోరుకున్నవాళ్లు కూడా ఇంత ఘోరంగా ఓడిపోతాడని ఊహించలేదు. సర్వేలు, ముందస్తు అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ ఏవీ కూడా జగన్‌ని జనం ఇంతగా తిరస్కరిస్తారని చెప్పలేదు. టైఫ్ ఫైట్ ఖాయమని లేదంటే జగన్‌కు తక్కువలో తక్కువ 50 నుంచి 60 సీట్లు వస్తాయని తెలిపాయి.
కానీ ఫలితాలు వచ్చిన తర్వాత కానీ వచ్చింది వేవ్ కాదు, సునామీ అని తెలిసింది. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నికల్లో 86 శాతం సీట్లు గెలిచి రికార్డుల్లోకెక్కిన వ్యక్తికి ఇప్పుడు ప్రతిపక్షనేత హోదా కూడా దక్కలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతో మంచి చేశానని .. కానీ ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కావడం లేదని జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి జగన్ అభిమానులే కాదు, ప్రజలు కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈసారి బలం పుంజుకుని బలంగా బౌన్స్ బ్యాక్ అవుతామని , జగన్‌కు అండగా ఉంటామని వైసీపీ కేడర్, మద్ధతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అయితే వైసీపీ ఓడిపోయిన క్షణం నుంచి కూటమి కేడర్ సామాజిక మాధ్యమాల్లో జగన్ పార్టీపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా మంత్రులు, ఇతర కీలక నేతలు గతంలో మాట్లాడిన మాటల తాలూకా వీడియోలను బయటకు తీసి వాటికి కౌంటర్ ఇస్తున్నాయి. కొన్ని చోట్ల తెలుగుదేశం శ్రేణులు రెచ్చిపోతున్నాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమను ఐదేళ్లు కేసులు పెట్టి వేధించారని, దౌర్జన్యం చేశారని వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
వైసీపీ కేడర్ పరిస్ధితే ఇలా ఉంటే.. మరి దాని అధినాయకుడు జగన్‌ని వదిలిపెడతారా. ఓడిపోయాడన్న కనికరం కూడా చూపకుండా నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నాయి కూటమి శ్రేణులు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిపై ట్రోలింగ్ తారాస్థాయికి చేరింది. యూట్యూబ్ , ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఫ్లాట్‌ఫామ్ ఏదైనా సరే ట్రోలర్స్ దేనిని వదలకుండా జగన్‌ని ఓ ఆట ఆడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో భారతదేశంలో రాజకీయ పార్టీలు - వ్యవస్థాపకులు అంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే చిన్న వీడియో సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ వరకు స్థాపించిన సంవత్సరం, స్థాపించిన వ్యక్తుల వివరాలను ఒక్క ముక్కలో చెప్పారు. ఈ లిస్ట్‌లో తెలుగు గడ్డపై ప్రాంతీయ పార్టీలుగా విలసిల్లుతోన్న టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ, జనసేనలకు కూడా స్థానం దక్కింది. తెలుగుదేశాన్ని ఎన్టీఆర్, టీఆర్ఎస్‌ను కేసీఆర్, జనసేనలను పవన్ కళ్యాణ్ స్థాపించారని అందులో వివరించారు. అయితే వైసీపీ విషయానికి వచ్చే సరికి దానిని స్థాపించిన వ్యక్తి కొలిశెట్టి శివకుమార్ పేరు ఉంది. ఇంకేముంది దీనిని అడ్డు పెట్టుకొని ట్రోలర్స్ జగన్ మామపై రెచ్చిపోయారు. ముందు సొంత పార్టీ పెట్టు జగనన్న అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వీటికి వైసీపీ మద్ధతుదారులు కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
వాస్తవానికి తన తండ్రి , దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో అప్పుడు కడప ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. వైఎస్ పేరు కలిసొచ్చేలా తన పార్టీకి పేరుండాలని భావించిన జగన్ '' వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ '' అయితే బాగుంటుందని యోచించారు. అయితే అప్పటికే వైఎస్సార్‌సీపీని (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ) నల్గొండ జిల్లాకు చెందిన కొలిశెట్టి శివకుమార్ స్థాపించి ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ కూడా చేయించారు.

అయితే జగన్ విజ్ఞప్తి మేరకు శివకుమార్ ఆ పార్టీని ఆయనకు ఇచ్చారు. తదనంతరం వైసీపీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్, గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ, శివకుమార్ క్రియాశీలక కార్యకర్తగా కొనసాగారు. అయితే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని శివకుమార్ పిలుపునివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. ఆయనను వైసీపీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై శివకుమార్ కోర్టును సైతం ఆశ్రయించారు. పార్టీ తనదని, తనను సస్పెండ్ చేసే అధికారం జగన్‌కు లేదని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











