తమ్ముడి విషయంలో చిరంజీవి మౌనం ఎందుకు?
గబ్బర్ సింగ్ చిత్రం విడుదలై మూడు వారాలవుతోంది. పవర్ స్టార్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. తెలుగు పరిశ్రమ రికార్డులన్నీ బద్దలు కొడుతూ కలెక్షన్ల పరంగా దూసుకెలుతోంది. గబ్బర్ సింగ్ ఘన విజయంపై దర్శకరత్న దాసరి నారాయణ రావు కూడా ప్రశంసలు గుప్పించారు. ఇంకా అనేక మంది ప్రముఖులు కూడా గబ్బర్ సింగ్ చిత్రాన్ని, పవన్ కళ్యాణ్ నటనను అభినందించారు.
ఇంత మంది గబ్బర్ సింగ్‌పై స్పందించినా...మెగాస్టార్, అన్నయ్య చిరంజీవి మాత్రం గబ్బర్ సింగ్ చిత్రంపై ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా పబ్లిక్ కామెంట్స్ చేయలేదు. కనీసం మాట వరుసకైనా....ఏ సందర్భంలోనూ తమ్ముడి సినిమా ప్రసక్తే తేలేదు. మరి చిరంజీవి మౌనం వెనక కారణం ఏమిటి అనే అంశం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది.
ఇదే విషయాన్ని ఈ చిత్రం నిర్మాత బండ్ల గణేష్‌ను అడిగ్గా...'గబ్బర్ సింగ్ చిత్రం సక్సెస్ అయ్యాక ఫస్ట్ నన్ను అభినందించింది చిరంజీవే. ఓ వైపు ఎన్నికల ప్రచారం, మరో వైపు చరణ్ పెళ్లి పనుల్లో ఆయన చాలా బిజీగా తీరిక లేకుండా గడుపుతున్నారు' అంటూ సమాధానం ఇచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య విబేధాలు ఉన్నట్లు వచ్చే అసత్యపు వార్తలను నమ్మ వద్దని నిర్మాత నొక్కి చెప్పారు.
సెలబ్రిటీల విషయంలో ఏ చిన్న మైనస్ పాయింట్ దొరికినా.....మీడియా వారికి బోలెడు వార్తలు. ఇక మెగాస్టార్, పవర్ స్టార్ లాంటి సెలబ్రిటీల విషయంలో వార్తల పండగే. మరి వారికి అవకాశం ఇవ్వకుండా ఉండటానికైనా చిరంజీవి గబ్బర్ సింగ్ చిత్రం సక్సెస్ పై స్పందిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











