ఇదీ డీల్ : టి మంత్రి రుద్రమదేవి ఆడియోకు రావడం వెనక!
హైదరాబాద్: ‘రుద్రమదేవి' ఆడియో వేడుక ఇటీవల వరంగల్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో విడుదలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు. అయితే ఆయన వేడుకకు హాజరు కావడం వెనక ఓ డీల్ ఉందట. ఈ విషయం స్వయంగా మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
‘రుద్రమదేవి' ఆడియో వేడుకకు నిర్వాహకులు ఆహ్వానించారని, అయితే తమ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని సినిమా ఇంటర్వెల్ సమయంలో ప్రదర్శిస్తే... డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమానికి హాజరవుతారని వారికి హామీ ఇచ్చానని, తన ప్రతిపాదనకు వారు అంగీకరించారని, ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రుద్రమదేవి ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యారని హరీష్ రావు వెల్లడించారు.
రుద్రమదేవి సినిమా విషయానికొస్తే....
అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈచిత్రంలో గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. రానా ముఖ్యమైన పాత్ర పోషించారు. రాణీ రుద్రమది ఓ అద్భుతమైన ప్రయాణం. ప్రపంచ చరిత్రలో ఆమె స్థానం పదిలం. ఈ తరానికి ఆమె కథ తెలియాలి. సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. అనుష్క కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది . రాణీ రుద్రమ కదనరంగంలోనే కాకుండా కళా రంగంలోనే గొప్ప కళాకారిణి అని, కత్తిపట్టినా, కాళ్ళకు గజ్జె కట్టినా ఆమెకు సాటి ఆమేనని ఈ చిత్రంలో దర్శకుడు తెలియజేయనున్నాడు.

అమ్మాయిలంటే అందాల రాశులే కాదు, వీరనారీలు కూడా. ప్రేమ, కరుణ విషయంలో సున్నితమనస్కులే. కానీ శత్రు సంహారం చేయాల్సినప్పుడు అపరకాళీ అవతారం ఎత్తుతారు. రుద్రమదేవి కథ కూడా అలాంటిదే. రుద్రమదేవి తెగువ, ధైర్యం స్త్రీ జాతికే గర్వకారణం. ఆమె సాహసాలకు మేం తెర రూపం ఇస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.
భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు. సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకు హైలెట్ కానుంది.
ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా....నిత్యామీనన్, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'


Click it and Unblock the Notifications











