పోసాని కృష్ణమురళీకి మెగా ఫ్యామిలీ అంటే ఎందుకంత కోపం ..?
నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి ఓ స్టైల్ వుంది. ఏ విషయాన్ని అయినా కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడుతాడు.. సినిమాలలోనే కాదు, నిజ జీవితంలోనూ కృష్ణమురళిది అదే తీరు. ఇదే ఆయన బలం, బలహీనత. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి ఎందుకో తెలియదు కానీ.. గత కొన్నేళ్లుగా మెగా కుటుంబమంటే చాలు ఒంటికాలిపై లేస్తున్నారు. పవర్ ఫుల్ డైలాగ్స్, పంచులతో చెడుగుడు ఆడుకున్నాడు. ఒకప్పుడు మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా మెలిగిన పోసాని కృష్ణమురళీ ఇప్పుడు ఆ కుటుంబంపై ఎందుకంతలా విరుచుకుపడుతున్నారో ఒకసారి చూస్తే .
రచయితగా, డైలాగ్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళీ .. చిరంజీవిని ఎక్కువగా అభిమానించేవారు. మెగా కాంపౌండ్‌లోని హీరోలందరితో కలిసి పనిచేశారు. అంతేందుకు అసలు పవన్ కళ్యాణ్‌కి పవర్‌స్టార్ అనే బిరుదును ఇచ్చిందే పోసాని అన్న సంగతి చాలా మందికి తెలియదు. పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత సినిమాకు పోసాని డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. ఆ మూవీ ప్రచార సమయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్.. పవర్‌స్టార్ అవుతాడని చెప్పారు. ఆ వెంటనే చాలా పత్రికలు పవన్ పేరు ముందు పవర్‌స్టార్ చేర్చాయి. పోసాని చెప్పినట్లుగానే గోకులంలో సీత సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

ఈ మూవీ హిట్ తర్వాత చిరంజీవి, పవన్‌లకు ఆప్తుడైపోయారు పోసాని. మెగాస్టార్‌కు తలలో నాలుకలా మారిన ఆయన చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తన సహాయ సహకారాలు అందించారు. ఈ క్రమంలో ప్రజారాజ్యం పార్టీలోని కీలక నేతల్లో ఒకరిగా నిలిచారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధిగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. నాటి ఎన్నికలు పోసానితో పాటు తక్కువ సమయంలోనే ఏపీ సీఎంగా బాధ్యతలు అందుకోవాలని భావించిన చిరంజీవికి కూడా షాకిచ్చాయి. కేవలం 18 స్థానాల్లోనే పీఆర్పీ విజయం సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది.
కానీ పార్టీని నడపలేక కొద్దికాలానికే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. అయితే మెగాస్టార్ నిర్ణయాన్ని ఆయన అభిమానులతో పాటు కాపు సామాజికవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. పోసాని సైతం ఈ విషయంలో చిరంజీవిని తప్పుబట్టారు. తర్వాత అనేక సందర్భాలలో ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చి విమర్శలు చేశారు పోసాని. కాపులకు ఒక్క మాట కూడా చెప్పకుండా పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఆర్పీ విషయంలో చిరంజీవికి పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారని.. ప్రజారాజ్యం విఫలమయ్యాక, ఆ పార్టీ కాడీని మధ్యలో వదిలేసిన వ్యక్తుల్లో పవన్ ఒకరని ఆరోపించారు. యువరాజ్యం బాధ్యతల నుంచి తప్పుకున్నాడని, నాగబాబు సైతం చిరంజీవిని వదిలేశాడని తాను మాత్రమే చివరి వరకు మెగాస్టార్‌తో నడిచానని ఒకానొక సందర్భంలో పోసాని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల తర్వాత పోసానికి మెగా ఫ్యామిలీకి దూరం పెరుగుతూ వచ్చింది.
పీఆర్పీ తర్వాత కొంతకాలం టీడీపీ మద్ధతుదారుగా వున్న పోసాని ప్రస్తుతం వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ పంచన చేరారు. పార్టీపై, ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేస్తున్న ఘాటు విమర్శలకు అంతే స్థాయిలో పోసాని కౌంటర్ ఇస్తున్నారు. అయితే హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో పవన్ కళ్యాణ్ కుటుంబం, వ్యక్తిగత విషయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పోసానిపై ఇండస్ట్రీ పెద్దలే కన్నెర్ర చేశారు. ఒకానొక దశలో ఆయనపై అనధికారిక నిషేధం నడిచి.. సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిస్ధితికి మెగా ఫ్యామిలీయే కారణమన్న భావనలో పోసాని కృష్ణమురళి వున్నారని ఫిలింనగర్ టాక్. అందుకే ఆయన నేరుగా చిరంజీవి కుటుంబాన్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











