Oscars for RRR అయ్యో పాపం దానయ్య.. నిర్మాతను విస్మరించిన ఆర్ఆర్ఆర్ టీమ్
తెలుగు పాటకు, సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. సినీ పరిశ్రమలో నోబెల్ బహుమతిగా భావించే పురస్కారం ఆస్కార్ అవార్డు తెలుగు పాట నాటు నాటును వరించింది. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన RRR చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచ సంగీత అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా పలు అవార్డులను అందుకొన్నది.
ఈ సినిమా యూనిట్‌లోని ప్రతీ ఒక్కరికి ప్రశంసలు లభిస్తుండగా.. సినిమాకు మూలంగా నిలిచిన నిర్మాత డీవీవీ దానయ్య పేరు ఎక్కడ వినిపించకపోవడం, ఎవరూ కూడా ప్రస్తావించకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా వివాదంగా మారిన విషయం గురించిన వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్‌తో గ్లోబల్ ఇమేజ్
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై RRR చిత్రం కోవిడ్ పరిస్థితులకు ముందు షూటింగ్ ప్రారంభమైంది. కోవిడ్, ఇతర సమస్యల కారణంగా సినిమా అనేక మార్లు షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత రిలీజ్ డేట్లు కూడా మారాయి. ఇలాంటి సమస్యలను ఎదురించి ఈ సినిమా కోసం దాదాపు 550 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసి RRR సినిమాకు గ్లోబల్ ఇమేజ్ తీసుకు రావడంలో దానయ్య సక్సెస్ అయ్యారు.

భారీగా ప్రమోషన్స్‌తో
ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఉన్న ప్రతీ ప్రాంతానికి RRR చిత్రాన్ని తీసుకెళ్లడంలో నిర్మాతగా డీవీవీ దానయ్య చేసిన ప్రమోషన్స్ వెలకట్టలేం. ఈ సినిమాకు ఖర్చుపెట్టిన బడ్జెట్‌లో దాదాపు ఎక్కువ శాతం ప్రమోషన్స్ కోసం కేటాయించారు. దాదాపు 1300 కోట్ల రూపాయలు వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

80 కోట్ల వివాదం
అయితే గత కొద్ది నెలలుగా ఆస్కార్ కోసం RRR టీమ్ అమెరికాలో మకాం వేసి భారీగా ఖర్చు చేసిన విషయం వివాదాస్పదంగా మారింది. నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా 80 కోట్లకుపైగా ఖర్చు చేశారని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
అయితే ఈ ప్రమోషన్స్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ అక్కడో ఎక్కడో వార్తల్లో నిలిచారు. కానీ నిర్మాత దానయ్య కనిపించకపోయినా.. ఆయన పేరు మాత్రం ఎక్కడ వినిపించకపోవడం, అలాగే యూనిట్ సభ్యులు కూడా ఆయన పేరు ప్రస్తావించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.

వినిపించని నిర్మాత దానయ్య పేరు
RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన సంస్థలు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ అసోసియేషన్ అవార్డులను అందజేశాయి. అలాగే తాజాగా ఆస్కార్ అవార్డు కూడా నాటు నాటు పాటకు లభించింది. ఈ అవార్డు అందుకొన్న సమయంలో ప్రతీ ఒక్కరు తమ టీమ్ మెంబర్స్ గురించి చెప్పుకొంటూ ప్రశంసించారు. కానీ డీవీవీ దానయ్య పేరు మర్యాదకైనా ఉచ్చరించకపోవడంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

మీడియాకు దూరంగా నిర్మాత దానయ్య
ఇక RRR సినిమాకు అవార్డులు వస్తున్న క్రమంలో గానీ, లేదా ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంలో గానీ.. దానయ్య మాట్లాడినట్టు.. స్పందించినట్టు ఎక్కడా కనిపించకపోవడం మరింత చర్చనీయాంశమైంది. మీడియా కూడా నిర్మాత దానయ్యను పట్టించుకొన్నట్టు కనిపించలేదు. ఈ ప్రమోషన్స్‌లో గానీ, అవార్డులు వస్తున్నప్పుడు గానీ.. నిర్మాత డీవీవీ దానయ్య ఎందుకు దూరంగా ఉన్నారనే విషయం అంతుపట్టకుండా ఉంది. ఈ విషయంపై RRR, లేదా డీవీవీ దానయ్య స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











