మహర్షి కథ కూడా నాదే, త్వరలోనే కోర్టుకు.. శ్రీమంతుడు తర్వాత బాంబు పేల్చిన రచయిత
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం కాపీరైట్ వివాదంలో చిక్కుకొన్న విషయం విషయం తెలిసిందే. రచయిత ఆర్డీ విల్సన్ అలియాస్ శరత్ చంద్ర ఈ సినిమా కథ నాదే అంటూ నాంపల్లి కోర్టులో కేసు వేయడం ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం తెలిసిందే. అయితే తాజాగా మహర్షి సినిమా కథ కూడా నాదే అంటూ శరత్ చంద్ర చెప్పినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. శ్రీమంతుడు, మహర్షి సినిమాల వివాదాల గురించిన వివరాల్లోకి వెళితే..
శ్రీమంతుడు మూవీ కథ నాదే. నా అనుమతి లేకుండా నా కథను సినిమాగా తీశాడని రచయిత శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత దర్శకుడు కొరటాల శివకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. తగిన పరిహారంతోపాటు శిక్ష కూడా విధించినట్టు వార్తలు వచ్చాయి. అయితే తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

శ్రీమంతుడు కాపీరైట్ వ్యవహారంలో సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగాయి. అయితే చివరకు దిగువ కోర్టు చెప్పిందే కరెక్ట్. ఈ తీర్పులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఈ కేసును మీరు ఉపసంహరించుకొంటారా? మేమే కొట్టివేయాలా? అని సుప్రీంకోర్టు స్పందించింది. దాంతో కొరటాల శివ తరఫు న్యాయవాది కేసు వాపసు తీసుకొన్నారు.
శ్రీమంతుడు కేసు ఓ వైపు కొనసాగుతుండగానే.. రచయిత శరత్ చంద్ర మరో బాంబు పేల్చాడు. శ్రీమంతుడు కథ మాత్రమే కాదు.. మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన మహర్షి సినిమా కథ కూడా నాదే. నా నవలను సీన్ టూ సీన్ కాపీ కొట్టారు. త్వరలోనే మహర్షి కథాచౌర్యంపై చట్టపరంగా చర్యలు తీసుకొంటాను. ఒకసారి శ్రీమంతుడు వివాదం సెటిల్ అయిన తర్వాత మహర్షి సినిమాపై లీగల్‌గా స్పందిస్తాను అని మీడియాకు తెలిపినట్టు ఓ వార్త ప్రచారం అవుతున్నది.

అయితే మహర్షి సినిమా కథ నాదేనంటూ ఆలస్యంగా క్లెయిమ్ చేసుకోవడంపై సినీ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీమంతుడు వివాదం కొనసాగుతుండగా ఈ సినిమాపై పెదవి విప్పని ఆయన తాజాగా లీగల్‌గా చర్యలు తీసుకొంటానని చెప్పడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై శరత్ చంద్ర కోర్టుకు వెళితే గానీ.. అసలు విషయం బయటపడే అవకాశం లేదని అంటున్నారు.

ఇదిలా ఉండగా, ఆచార్య మూవీ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో దేవర అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మొదటి పార్ట్‌ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.


Click it and Unblock the Notifications











