Dasara: మీకు సిగ్గుందా.. మమ్మల్ని అడగరా.. దసరా మూవీపై వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గతేడాది హీరోగా అంటే సుందరానికి సినిమాతో అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది దసరా మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతోంది.
ఇందులో ధరణిగా పాత్రలో కనిపించిన నాని కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సినిమా వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా చూసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దసరా మూవీపై రివ్యూ ఇచ్చారు.

మద్యానికి బానిస..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించిన దసరా సినిమాలో నాని, కీర్తి సురేష్ తమ అద్భుతమైన నటనతో అలరించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 30న విడుదలై ఘన విజయం సాధించింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక ఊరు మద్యానికి ఎలా బానిస అయింది, దాని చుట్టు అల్లుకున్న రాజకీయం వంటి అంశాలను చూపించారు.

అడ్వాన్స్ గా డబ్బులు..
అయితే తాజాగా దసరా సినిమా చూసిన వైసీపీ పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దానిపై రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ "నేను ఇటీవల దసరా సినిమా చూశాను. ఈ మూవీ బ్యాక్ డ్రామ్ మద్యం ఓ ఊరిని పాడుచేస్తుంటుంది. ఆ ఊర్లో మద్యాన్ని తీసేస్తానన్నవాడు ఓడిపోతాడు. మద్యంతోపాటు అడ్వాన్స్ గా డబ్బులు కూడా ఇస్తానని చెప్పిన వాడిని ప్రజలు గెలిపిస్తారు" అని అన్నారు.

ఇలాంటి చెత్త సరుకు..
రఘురామ కృష్ణంరాజు కొనసాగిస్తూ.. "మద్యం ఇస్తానన్న వాడు గెలిచిన తర్వాత పర్యవసానం కూడా సినిమాలూ చూపించారు. అందుకు కారణం చీప్ లిక్కర్. ఆ సినిమాలో చూపించిన లిక్కర్ సెంటర్ పేరు సిల్క్ బార్. అక్కడ మందు తాగటం వల్ల ఊర్లో మగవాళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంటుంది. ఆడవాళ్ల సంఖ్య పెరుగుతుంటుంది. ఇలాంటి చెత్త సరుకు అమ్మి ప్రజల ప్రాణాలు తీసి మగవారి సంఖ్య తగ్గించి ఆడవారి సంఖ్య పెరిగిపోయేలా చేస్తున్నారని చివరికి ప్రజల్లో చైతన్యం వస్తుంది" అని తెలిపారు.

స్ఫూర్థినిచ్చే సినిమా..
"ప్రజల్లో చైతన్యం వచ్చి ఇలాంటి వారిని ఎన్నుకుని తప్పు చేశామని తెలుసుకు తర్వాతి ఎన్నికల్లో ఓడిస్తారు. అప్పటివరకు వారిపై చేసిన అఘాయిత్యాలకు తిరగబడతారు. ఇక సినిమా అన్నాక ఫైటింగ్స్ ఉంటాయి కాబట్టి చంపేస్తారు. చీప్ లిక్కర్ తో ప్రజల ప్రాణాలను హరించాలో సినిమాలో వారిని ప్రజలు చివరికి ఓడిస్తారు. సినిమాను అందరూ తప్పకుండా చూడండి. అందరికి స్ఫూర్తినిచ్చే సినిమా ఇది" అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

మహిళలు తిరగబడాలి..
"ఈ సినిమా ముఖ్యంగా మహిళలు చూసి తిరగబడాలి. మిమ్మల్ని మోసం చేశాం. సిగ్గు లేదా మీకు. మమ్మల్ని అడగరా. ఏమయ్య రఘు ఎలక్షన్స్ లో మీ పార్టీ మద్యాన్ని నిషేధిస్తామని అన్నారు. కానీ మీరు చేసిందేంటీ. నాలుగు రెట్లు పెంచారు. సిగ్గుంటే మమ్మల్ని తిట్టండి. ఏపీలో కూడా ఈ లిక్కర్ తాగి కిడ్నీలు, లివర్ పోయి ఎంతోమంది చనిపోతున్నారు. అందులో కెమికల్స్ ఉన్నాయని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఎవరొచ్చారు. ఎలా మనేజ్ చేశారనేవన్నీ విషయాలు మాకు తెలుసు" అని ఎంపీ చెప్పుకొచ్చారు.

మాలాంటి నాయకులను..
"దసరా సినిమాను తప్పకుండా చూడండి. నాని ధైర్యవంతుడు. దసరా చక్కటి సినిమా. మద్య నిషేధం గురించి మహిళలు ఈ సినిమా చూడాలి. దయచేసి నువ్వు చెప్పిందేంటీ.. చేసిందేంటని మోసం చేసిన మాలాంటి నాయకులను ప్రశ్నించమని అడుగుతున్నాను" అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











