అది కరెక్ట్ కాదు: యేలేటి చంద్ర శేఖర్
హైదరాబాద్ : అందరూ నేనే ఆలస్యం చేస్తున్నాననుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. కథల విషయంలో నేను కొత్తగా ఆలోచిస్తా. నిర్మాతలు, హీరోలు కొత్తరకం కథల్ని 'ఓకే' చేయడానికి కాస్త సమయం పడుతుంది. వాళ్లకు ఆ కథలు నచ్చడం, దానిపై కొన్ని రోజులు వర్కవుట్లు చేయడం, మళ్లీ రిస్క్ ఎందుకని వాటిని పక్కన పెట్టడం, మళ్లీ కొత్త కథలు తయారు చేయడం.. అందుకే ఈ ఆలస్యం అంటూ తన ఆలస్యానికి కారణం వివరించారు యేలేటి చంద్రశేఖర్.
ప్రస్తుతం గోపిచంద్ హీరోగా 'సాహసం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. అలాగే ఈ చిత్రం కౌబాయ్ తరహా చిత్రం కాదంటున్నారు. తన ఆస్తిని దక్కించుకోవడం కోసం హీరో చేసే ప్రయాణమే 'సాహసం'. అయితే...ఈ ప్రయాణంలోనే ట్రెజర్ హంట్ అనేది లింక్ అవుతుంది. అదేంటో తెరపై చూస్తేనే బావుంటుంది అని వివరించారు.
ఇక చిత్రంలో గోపిచంద్ క్యారక్టరైజేషన్ గురించి వివరిస్తూ...ఇందులో ఆయన సాధారణమైన సెక్యూరిటీ గార్డ్. కానీ అతనికి దూరమైన ఆస్తి కోట్లల్లో ఉంటుంది. దాన్ని వెతుక్కుంటూనే వెళతాడు అన్నారు. ఇండియా నుంచి పాకిస్థాన్ వేరు పడినప్పుడు జరిగిన ఓ సంఘటనే ఈ కథకు ప్రేరణ అన్నారు.
అలాగే గోపిచంద్ కోసమే ఈ కథ తయారు చేశారా అన్న విషయం వివరిస్తూ... కథ రాసుకున్న తర్వాత ఆ కథకు గోపిచంద్ 'ఓకే' అయ్యారు. ఇందులో ఆయన పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. 'ఒక్కడున్నాడు'తో పోల్చిచూస్తే... చాలా ఫైర్ ఉన్న పాత్ర ఇది. సెల్వ కెమెరా పనితనం, 'అందాల రాక్షసి' ఫేం రామా కళాదర్శకత్వం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి అన్నారు.
తాప్సీ పాత్ర గురించి చెప్తూ... అలాగే తాప్సీది ఇందులో కీలకమైన పాత్ర. ఈ ప్రపంచంలో పాపులు పెరిగిపోయారు. మరో రెండేళ్లలో ఈ భూమండలం నాశనమై పోతుందని నమ్మే ఓ అమ్మాయి తను. గోపిచంద్ జీవితంలోకి తను ఎలా ప్రవేశించింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు.


Click it and Unblock the Notifications











