'ఎవడు' రిలీజ్ డేట్ ఖరారు (అఫీషియల్)
హైదరాబాద్ : ఇప్పటికే చాలా రిలీజ్ డేట్స్ మార్చిన 'ఎవడు' యూనిట్ మొత్తానికి ఓ నిర్ణయానికి వచ్చి విడుదల తేదీ ప్రకటించింది. జులై 31 నే విడుదల తేదీ అని అఫీషియల్ గా ప్రకటించేసారు. అత్తారింటికి దారేది చిత్రం ఆగస్టు 7 విడుదల తేదీ ఇవ్వటంతో అంతా 'ఎవడు' రిలీజ్ డేట్ మారుస్తారని ఎదురుచూసారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఈ డేట్ ని దిల్ రాజు ప్రకటించారు.
నిర్మాత మాట్లాడుతూ ''జులై 31.. ఎవరూ మర్చిపోలేని రోజు. రామ్‌చరణ్ సినిమా 'మగధీర' ఆ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు 'ఎవడు' సినిమానీ అదే రోజు విడుదల చేయడం ఆనందంగా ఉంది. చరణ్ తన పాత్రలో చక్కగా ఇమిడిపోయాడు. పోరాట దృశ్యాలూ, నృత్యాలూ అందరినీ ఆకట్టుకొంటాయి. అల్లుఅర్జున్ చేసింది చిన్న పాత్రే అయినా, కథకు చాలా కీలకం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తోంది. వంశీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం తప్పకుండా నచ్చుతుంది'' అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ....''ఊహకందని స్థాయిలో ఈ చిత్రం కథ, కథానాలుంటాయి. రామ్‌చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా ఈ చిత్రం నిలుస్తుందని మా నమ్మకం. జూలై మెగా ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చిన నెల. చిరంజీవిగారి 'ఇంద్ర', పవన్‌కల్యాణ్‌గారి 'తొలిప్రేమ', రామ్‌చరణ్ 'మగధీర' చిత్రాలు ఇదే నెలలో విడుదలై సంచలనాలు సృష్టించాయి. ముఖ్యంగా 'మగధీర' రిలీజైన జూలై 31నే 'ఎవడు' కూడా వస్తోంది. ఆ ఫీట్‌ని ఈ చిత్రం రిపీట్ చేస్తుందని నా నమ్మకం. శ్రుతి హాసన్, అమీ జాక్సన్ అందాలు, దేవిశ్రీప్రసాద్ మెస్మరైజింగ్ మ్యూజిక్.. వీటన్నింటినీ మించి వంశీ మేకింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలువనున్నాయి. ఇందులో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి'' అన్నారు.రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్. వంశీపైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రాన్ని ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. కాజల్ అతిథి పాత్రలో కనిపించనుంది. జయసుధ, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: ఆనంద్ సాయి, సహ నిర్మాతలు: శిరీష్ - లక్ష్మణ్.


Click it and Unblock the Notifications












