నత్తనడకన ‘ఎవడు’-ఒత్తిడిలో దర్శక నిర్మాతలు!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ఎవడు'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈచిత్రం షూటింగ్ ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం జరుగడం లేదు. అనేక కారణాలతో డిలే అవుతూ వస్తోంది. దీంతో దర్శక, నిర్మాతలపై ఒత్తిడి పెరిగిపోతోంది.
హీరో రామ్ చరణ్ 'ఎవడు' చిత్రంతో పాటు బాలీవుడ్ మూవీ జంజీర్, వివి వినాయక్ సినిమాలకు కూడా కమిట్ అయి వాటికి డేట్స్ కేటాయించడం, ఇటీవల రామ్ చరణ్ పెళ్లి జరుగడంతో షూటింగుకు కొంత కాలం బ్రేక్ వేయడం లాంటి కారణాలతో సినిమా లేట్ అవుతూ వస్తోంది. మరో వైపు ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ సమంత అనారోగ్య కారణాలతో షూటింగుకు హాజరు కాక పోవడం కూడా మరో కారణం.
తాజాగా దర్శక నిర్మాతలు సమంత స్థానంలో వేరే హీరోయిన్‌ని తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇలా పలు కారణాలతో సినిమా పోగ్రెస్ నత్తనడకన సాగుతుండటంతో అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసే అవకాశం కనిపించడం లేదు.
ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటిస్తుండగా అమీ జాక్సన్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి అద్భుతమైన బాణీలు సమకూర్చారు. కథ: వంశీ పైడిపల్లి, అబ్బూరి రవి, కెమెరా: చోటా కె. నాయుడు.


Click it and Unblock the Notifications











