మల్టీ స్టారర్ ‘ఎవడు’...ఖండిస్తున్న మెగా ఫ్యామిలీ
హైదరాబాద్ : రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా 'ఎవడు' చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ కాగా, బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొంది ఇటీవల విడుదలై 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మంచి విజయం సాధించిన నేపథ్యంలో టాలీవుడ్లో మల్టీ స్టారర్ మేనియా ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజాగా 'ఎవడు' చిత్రం రామ్ చరణ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ అంటూ ప్రచారం మొదలైంది.
అయితే 'ఎవడు' చిత్రాన్ని మల్టీ స్టారర్ చిత్రంగా ప్రచారం చేయడాన్ని మెగాస్టార్ ఫ్యామిలీకి చెందిన వారు ఖండిస్తున్నారు. 'ఎవడు' చిత్రం మల్టీ స్టారర్ కానే కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈచిత్రంలో అల్లు అర్జున్ కేవలం అతిథి పాత్ర మాత్రమే చేస్తున్నారని, దీన్ని మల్టీ స్టారర్ అనడం సబబు కాదంటున్నారు.
కాగా..ఎవడు చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రంతో పాటు బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు చాలా తక్కువ గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.


Click it and Unblock the Notifications











