‘పటాస్’ హిట్టు ఎవరికి బాగా కలిసొచ్చింది?
హైదరాబాద్: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా టాక్ బావుండటంతో కలెక్షన్లు బాగా వస్తున్నాయి. ప్రేక్షకుల తాకిడి పెరగడంతో థియేటర్ల సంఖ్యను కూడా బాగా పెంచారు. ఈ సినిమా విజయం వల్ల బాగా కలిసొచ్చింది ఎవరికి? అంటే హీరో కళ్యాణ్ రామ్ పేరు కాకుండా, దర్శకుడు అనిల్ రావిపూడి పేరు చెబుతున్నారంతా.
హీరో కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి హీరో మరియు నిర్మాత. ఆయకు వస్తే గిస్తే లాభాలు వస్తాయి. కానీ దర్శకుడు అనిల్ రావిపూడికి ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో మంచి లైఫ్ వచ్చింది అంటున్నారు. సాధారణంగా సినిమా పరిశ్రమ అంటేనే హిట్ల చుట్టూ తిరుగుతుంది. ఒక హీరోగానీ, దర్శకుడుగానీ హిట్టు కొడితే ఆ హీరోతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు.

తాజాగా ‘పటాస్' విషయంలోనూ అదే జరిగింది. ‘పటాస్' విజయం వల్ల కళ్యాణ్ రామ్ కి కొత్తగా అవకాశాలు వచ్చినట్లు సమాచారం ఏమీ లేదు. కానీ అనిల్ రావిపూడికి పలువురు నిర్మాతలు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట. నెక్ట్స్ సినిమా తమతో అంటే తమతో చేయాలని కోరుతున్నారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ నుండి అతనికి ఆఫర్ వచ్చిందని సమాచారం.
మరికొందరు స్టార్స్ కూడా ఆయనతో చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. మొత్తానికి ‘పటాస్' విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయింది మాత్రం దర్శకుడు అనిల్ రావిపూడి అని చెప్పక తప్పదు. మరి తొలి విజయం ద్వారా ఆయనకు వచ్చిన స్టార్ స్టేటస్‌ను భవిష్యత్తులో ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











