‘నాయక్’పైరసీ నేడే చూడండి అంటూ...
హైదరాబాద్ : పెద్ద చిత్రాలకు పెద్ద తలనొప్పి పైరసీ. రిలీజైన రోజు నుంచి ఓ ప్రక్క ప్రమోషన్ తో పాటు పైరసీని అదుపు చెయ్యటానికి నివారణ చర్యలలో పడాలి. సంక్రాంతికి విడుదలైన 'నాయక్' కి కూడా పైరసీ పోటు ఎదురైంది. 'నాయక్ నేడే చూడండి' అని తమ సైట్ల ద్వారా ఫేస్‌బుక్ ద్వారా నిర్భయంగా ప్రకటన కూడా జారీ చేసి మరీ ఈ సినిమా పైరసీని ప్రోత్సహిస్తున్న ఓ వ్యక్తి దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళితే.. పదిహేడు వెబ్‌సైట్లను రన్ చేస్తున్న ఓ యువకుడు రామ్‌చరణ్ హీరోగా నటించిన 'నాయక్' చిత్రం పైరసీకి పాల్పడ్డాడు. దాంతో ఆ యువకుని వివరాలను యాంటీ పైరసీ సెల్ వారు శోధించారు. వెంటనే లొంగిపోవాలని నోటీస్ కూడా జారీ చేశారు. ఈ కారణంగా హైదరాబాద్‌లోని తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి కార్యాలయంలో ఆ యువకుడు లొంగిపోయాడు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ- ఇప్పటికి 25, 700 మంది ఇతని సైట్స్‌ని, 14, 874 మంది ఇతని ఫేస్‌బుక్‌ని వీక్షిస్తున్నారు. ఇతను చేసింది చాలా పెద్ద నేరం. కానీ ఈ యువకునిపై మేము ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు. ఎందుకంటే అలా చేస్తే అతని జీవితం ప్రశ్నార్థకం అవుతుంది, పైరసీని వెంటనే ఆపేస్తానని అతను ప్రాధేయపడ్డాడు. అతనిలో వచ్చిన మార్పుకు సంతోషం. ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. జీవితాన్ని తేలిగ్గా తీసుకోవద్దని ఈ సందర్భంగా వారికి చెబుతున్నాను. అన్నారు,
అలాగే...పైరసీ నిర్మూలనపై మా ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయ్. పైరసీని నిర్మూలించే క్రమంలో గూండా యాక్ట్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరాము. దానికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయ్'' అని తెలిపారు. ఇంకా 'నాయక్' చిత్ర సమర్పకుడు ఎస్.రాధాకృష్ణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యూనివర్శల్ మీడియా పతాకంపై ఎస్. రాధాకృష్ణ సమర్పలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్‌రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











