Boycott Laila: లైలా బాయ్‌కాట్.. వైసీపీ శ్రేణుల ఆగ్రహం.. చిక్కుల్లో హీరో విశ్వక్ సేన్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లైలా. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల రిలీజైన సినిమా ట్రైలర్‌కు అనూహ్యంగా స్పందన లభించింది. ఈ క్రమంలో ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో 30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడమే కాకుండా వివాదాస్పదమయ్యాయి. ఈ వివాదం గురించిన వివరాల్లోకి వెళితే..
లైలా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా యాక్టర్ పృథ్వీ మాట్లాడుతూ.. సినిమాలో మేకల సత్తి అనే పాత్రలో నటిస్తున్నాను. నా వద్ద 150 మేకలు ఉండేవి. కానీ చివరకు 11 మేకలే మిగులుతాయి అనే విధంగా కామెంట్స్ చేశారు. అయితే 11 నంబర్‌ను తన స్పీచ్‌లో వాడటంపై పృథ్వీపై వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.

పృథ్వీ వ్యాఖ్యలు వివాదంగా మారడంతో విశ్వక్ సేన్ సందిగ్ధంలో పడ్డారు. ఆయనకు వైసీపీ నేతలు, సినీ వర్గాలు కాల్ చేసి వివాదాన్ని తగ్గుముఖం పట్టించేలా చర్యలు చేపట్టాలని సలహాలు ఇచ్చారట. వైసీపీ శ్రేణులు బాయ్‌కాట్ పిలుపు ఇస్తే సినిమాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి వారితో మాట్లాడి వివాదాన్ని ముగిసేలా చూసుకోవాలని సూచించారట.
దాంతో లైలా మూవీ యూనిట్ వెంటనే ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నది. వైసీపీ శ్రేణులు ఇచ్చిన బాయ్‌కాట్ ఉపసంహరించుకొనేలా వారికి వివరణ ఇవ్వాలని స్వయంగా విశ్వక్ సేన్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్‌లో విశ్వక్ సేన్ ఏం మాట్లాడుతారనే విషయం ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉండగా, విశ్వక్ సేన్‌కు వైసీపీ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారితో ఇప్పటికే చర్చలు జరిపారు. ఈ వివాదాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. పృథ్వీ తన క్యారెక్టర్‌కు సంబంధించిన సన్నివేశాన్ని కామెడీగా చెప్పారు. అందులో ఎలాంటి వివాదం లేదని క్లారిటీ ఇచ్చారని తెలిసింది. ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా వివాదాన్ని చిత్ర యూనిట్ ఎలా పరిష్కరించుకొంటారనేది ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











