చిరు ఫ్యామిలీ హీరోతో వైవియస్ చౌదరి చిత్రం కన్ఫర్మ్
వైవియస్ చౌదరి స్వీయ దర్సకత్వంలో చిరంజీవి మేనల్లుడు హీరోగా చిత్రం నిర్మించనున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ధట్స్ తెలుగు కూడా ఈ విషయాన్ని చాలా సార్లు తెలిపింది. అయితే అది రూమర్ అన్నట్లు గా ట్రీట్ చేయటం జరిగింది. ఇప్పుడా చిత్రం చేయబోతున్నామని వైవియస్ చౌదరి కన్ఫర్ఫ్ చేసారు. ఆయన మాట్లాడుతూ..."దర్శకుడిగా ఇది నాకు తొమ్మిదవ చిత్రమైతే, నిర్మాతగా ఐదవ చిత్రం. నూతన తారాగణంతో, భారీ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నా. ఇప్పటివరకు నా కెరీర్‌లో కొత్తవారితో తీసిన ప్రతి సినిమా విజయాన్ని సాధించింది. ఆ వరుసలోనే ఈ సినిమా ఉంటుందని గట్టిగా చెప్పగలను. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు తెలియజేస్తాం'' అని ఆయన చెప్పారు. ఇక ఈ కొత్త హీరో పూర్తి పేరు సాయి ధరమ్‌తేజ్. చిరంజీవికి అతను స్వయానా మేనల్లుడు (సోదరి కుమారుడు). ఇక వైవియస్ చౌదరి గతంలో 'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ' చిత్రం ద్వారా వెంకట్, చందులను; 'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రంతో ఆదిత్య ఓంను; 'దేవదాసు'తో రామ్‌ను హీరోలుగా పరిచయం చేసారు. చౌదరి ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థ బొమ్మరిల్లు పతాకంపై తీసే ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఈ చిత్రానికి రాయ్ అనే టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. బాలకృష్ణతో ఒక్క మగాడు, మంచు విష్ణు వర్ధన్ తో సలీం వంటి డిజాస్టర్ ఫిలింస్ ఇచ్చిన చౌదరికి ఈ చిత్రం ఎలాగైనా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications











