రామ్ చరణ్ ‘తుఫాన్’కు...సుప్రీం కోర్టు బ్రేక్!
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న జంజీర్ చిత్రం మళ్లీ కష్టాల్లో పడింది. ఈ సినిమా విడుదల కాకుండా సుప్రీంకోర్టు గురువారం నాడు ఆరు వారాల పాటు స్టే విధిస్తూ ఉత్తుర్వులు ఇచ్చింది. ఈ చిత్ర నిర్మాత అమిత్ మెహ్రా సోదరులు సుప్రీం కోర్టును ఆశ్రయించడమే ఇందుకు కారణం. జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
వివాదం వివరాల్లో వెళితే..
1973లో వచ్చిన 'జంజీర్' చిత్రం ఒరిజినల్ వెర్షన్‌ను అమిత్ మెహ్రా తండ్రి ప్రకాష్ మెహ్రా 'ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్' బేనర్ పై నిర్మించారు. అతని పెద్ద కుమారుడైన అమిత్ మెహ్రాకు సంబంధించిన అడయ్ మెహ్రా ప్రొడక్షన్స్ ప్రై.లి జంజీర్ చిత్రం రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది.
అయితే అమిత్ మెహ్రా తన ఇద్దరు సోదరులకు.... రీమేక్ రైట్స్‌కు సంబంధించిన డబ్బులను చెల్లించడంలో విఫలం అయ్యాడు. దీంతో వారు కోర్టును ఆశ్రయించి సినిమా విడుదల కాకుండా స్టే తెచ్చుకున్నారు. అయితే అమిత్ మెహ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. దీంతో అతని సోదరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆరు వారాల్లోగా వివాదం సెటిల్ చేసుకోవాలని సూచిస్తూ సుప్రీంకోర్టు స్టే విధించింది.
అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. జులై లేదా ఆగస్టు నెలలో ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











