ఓటీటీ లవర్స్‌కు సంక్రాంతి బొనాంజా .. ఒకేసారి స్ట్రీమింగ్‌లోకి 10 సినిమాలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైంది. పెద్ద పండుగను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో జరుపుకునేందుకు ప్రపంచ నలుమూలల్లో ఉన్న వారంతా తమ స్వగ్రామాలకు బయల్దేరుతున్నారు. ఇప్పటికే రైళ్లు, బస్సులు, విమానాలు కిక్కిరిసిపోతున్నాయి. వీకెండ్, సెలవులు కలిసి రావడంతో అంతా లాంగ్ లీవ్ పెట్టేసి పిల్లాపాపలతో కలిసి పల్లె వైపు సాగిపోతున్నారు. ఇక సంక్రాంతి పండుగ అంటే తెలుగువారికే కాదు.. తెలుగు సినిమాకు కూడా పెద్ద పండుగ. ఆ నాలుగు రోజులు నాలుగు కొత్త సినిమాలు విడుదలై పండుగ శోభను మరింత పెంచుతాయి.
ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా గేమ్ ఛేంజర్ , డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే థియేటర్‌కు వెళ్లలేని వారు ఓటీటీల వైపు ఆశగా చూస్తున్నారు. రియాలిటీ షోలు, వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ కంటెంట్‌తో ఆయా ఓటీటీ దిగ్గజాలు ప్రజలకు కావాల్సిన వినోదాన్ని సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి నేపథ్యంలో ఏకంగా 10 సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. అది కూడా జనవరి 10నే కావడం విశేషం.

ఓటీటీ లవర్స్ ఎంతగానో ఇష్టపడే క్రైమ్, హారర్ ఫాంటసీ థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్ , యాక్షన్ జోనర్స్‌లో ఈ 10 సినిమాలు ఉండనున్నాయి. అసలు ఇవి ఏమేం సినిమాలు? ఏ ఓటీటీలో ? ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతాయో? ఒకసారి పరిశీలిస్తే ముందుగా అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే.. సిద్ధార్ధ్- ఆషికా రంగనాథ్ నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం 'మిస్ యూ'.. తెలుగు, తమిళ భాషల్లో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫోకస్ అనే ఇంగ్లీష్ సినిమా కూడా ఇదే రోజున స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 10 నుంచి అడ్ విటమ్ (ఇంగ్లీష్), బ్లాక్ వారెంట్ (హిందీ వెబ్ సిరీస్ ), ఆల్ఫా మేల్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మన అల్లరోడు అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి ఈటీవీ విన్‌లో జనవరి 10న అందుబాటులోకి వచ్చింది. హైడ్ అండ్ సీక్ అనే తెలుగు క్రైమ్ మూవీ ఆహా ఓటీటీలో, అథోముగం ఆహా తమిళ్ ఓటీటీలో జనవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
గూస్ బంప్స్ ది వానిషింగ్ ( ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ) డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ డ్రామా చిత్రం ది సబర్మతి రిపోర్ట్ జీ 5లో జనవరి 10 నుంచి అందుబాటులో ఉంది. హిందీ రియాలిటీ షో అయిన రోడీస్ డబుల్ క్రాస్ మాత్రం జియో సినిమాలో జనవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి ఆయా ఓటీటీ సంస్థలు అధికారికంగా ఈ వివరాలు వెల్లడించగా.. త్వరలో మరిన్ని సంస్థలు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం ఒరిజినల్ కంటెంట్, వెబ్ సిరీస్‌లను ఇంటిల్లిపాది వీక్షిస్తూ ఈ పండుగను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోండి.


Click it and Unblock the Notifications