Akhanda 2 రిలీజ్ వాయిదా... బాలయ్య మూవీ ఓటీటీ డీల్‌లో షాకింగ్ ట్విస్ట్?
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 చిత్రం అనివార్య కారణాలతో వాయిదాపడిన సంగతి తెలిసిందే. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధికపరమైన అంశాలతో పాటు ఇతరత్రా కారణాలు ఈ సినిమా వాయిదాపడేలా చేశాయని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. వీటి నుంచి బయటపడి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే అఖండ 2 విడుదల వాయిదా పడటంతో ఓటీటీ డీల్ కూడా చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే...
బాలయ్య - బోయపాటిల అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. దాంతో డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ సందడి నెలకొంది. ఇంతలో అఖండ 2 నిర్మాతలు తమకు చెల్లించాల్సిన బకాయిలపై తేల్చాలంటూ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ సినిమా విడుదలపై న్యాయస్థానం స్టే విధించడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. తొలుత తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ రద్దు అవ్వగా.. ఆ వెంటనే ఓవర్సీస్‌లో ప్రదర్శించాల్సిన ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. సమస్య పరిష్కరించుకుని డిసెంబర్ 5న సినిమాను విడుదల చేస్తారని అంతా భావించినప్పటికీ అఖండ 2ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించడంతో బాలయ్య అభిమానులు షాక్‌కి గురయ్యారు.

అఖండ 2 వాయిదాపై రూమర్స్
కాగా.. అఖండ 2 వాయిదాపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వాటికి పలువురు సినీ ప్రముఖులు కౌంటర్లు ఇస్తున్నారు. కారణాలు తెలియకుండా ఏదేదో రాయొద్దని వారు సూచిస్తున్నారు. మరోవైపు.. అఖండ 2 విడుదల తేదీపై ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షో చేసిన అప్‌డేట్ కూడా కలకలం రేపింది. బాలయ్య- బోయపాటి సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని పేర్కొంది. కానీ ఇందులో విడుదల తేదీని మాత్రం బుక్ మై షో ప్రస్తావించలేదు. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది.
అఖండ 2 వాయిదాపై 14 రీల్స్ ప్లస్ క్లారిటీ
అఖండ 2ని థియేటర్‌లలోకి తీసుకురావడానికి ప్రయత్నించామని.. కానీ సాధ్యం కాలేదని, ఇందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులకు 14 రీల్స్ ప్లస్ సంస్థ క్షమాపణలు చెప్పింది. ఈ క్లిష్ట పరిస్ధితుల్లో అండగా నిలిచిన బాలయ్య, బోయపాటి శ్రీనుకు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే అఖండ 2కి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని 14 రీల్స్ ప్లస్ సంస్థ తెలిపింది. అంతా బాగానే ఉంది కానీ అఖండ 2 ఓటీటీ పరిస్ధితి ఏంటీ? బాలయ్య మూవీ ఓటీటీ డీల్ కూడా క్యాన్సిల్ అయ్యిందా? అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వివరాలు పరిశీలిస్తే..
భారీ ధరకు అఖండ ఓటీటీ డీల్
అఖండ 2 డిజిటల్ రైట్స్‌ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుందని టాలీవుడ్ టాక్. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ.. దాదాపు 85 కోట్ల రూపాయల పైమాటేనని అంచనా. ఓ బాలయ్య సినిమాకు ఈ స్థాయిలో ఓటీటీ డీల్ కుదరడం ఇదే తొలిసారి. అయితే ఈ డీల్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫార్మూలాను అనుసరించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. గతంలో ఓటీటీ హక్కుల అమ్మకం అనేది నిర్మాతలకు ఓ అదనపు ఆధాయంగా ఉండేది. సినిమా హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా భారీ మొత్తం వచ్చేది.
25 శాతం పర్ఫార్మెన్స్ రూల్
అయితే సినిమాలు ఫ్లాప్ కావడంతో భారీ ధర పెట్టి డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థలకు నష్టాలు వస్తున్నాయి. దీంతో ఓటీటీ అగ్రిమెంట్ విషయంలో కీలక మార్పులు చేస్తున్నాయి ఆయా స్ట్రీమింగ్ కంపెనీలు. తాజాగా అఖండ 2 విషయంలోనూ ఇదే పరిస్ధితి చోటు చేసుకుంది. దీని ప్రకారం .. అఖండ 2 సినిమా థియేటర్‌లలో సరిగా ఆడకపోతే 25 శాతం పేమెంట్‌ను తగ్గించుకోవాలి.. అదే సినిమా బాగా ఆడితే 25 శాతం కటింగ్ లేకుండా యథావిధిగా చెల్లింపులు జరుగుతాయి. దీని కింద అఖండ 2 ఓటీటీ డీల్ ప్రకారం.. బాలయ్య సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే 85 కోట్ల రూపాయల అగ్రిమెంట్ వాల్యూలో 25 శాతం అంటే 21.25 కోట్ల రూపాయలు తగ్గిస్తారు. అదే సినిమా బాగా ఆడితే మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. తద్వారా నెట్‌ఫ్లిక్స్ ఈ కొత్త రూల్‌తో ఓటీటీ డీల్ చేసిన తొలి సినిమాగా అఖండ 2 నిలవనుంది. మరి ఈ ఫార్ములా ఎంత వరకు సక్సెస్ అవుతుందో? నిర్మాతలు ఎంత వరకు దీనికి అంగీకరిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











