నెల తిరక్కుండానే ఓటీటీలోకి యాంకర్ ప్రదీప్ మూవీ .. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
ఫిమేల్ డామినేటింగ్ సెక్టారైన యాంకరింగ్‌లో అబ్బాయిలు రాణించడం కష్టమేనని అంతా అనుకుంటారు. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేసి అబ్బాయిలు కూడా యాంకరింగ్ అద్భుతంగా చేయగలరని నిరూపించారు ప్రదీప్ మాచిరాజు. తన వాక్చాతుర్యం, సమయస్పూర్తితో కార్యక్రమాలను అద్భుతంగా హోస్ట్ చేస్తూ దూసుకెళ్తున్నారు ప్రదీప్. యాంకరింగ్‌తో పాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్న ఈ స్టార్ యాంకర్ .. హీరోగానే అవతారమెత్తాడు. 30 రోజుల్లో ప్రేమించుకుందాం ఎలా? అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ టైటిల్‌తో ప్రదీప్ మాచిరాజు
యాంకర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ దీపిక పిల్లితో కలిసి ప్రదీప్ నటించిన చిత్రమే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను తెలుగు తెరకు అందించిన ఈ సినిమా టైటిల్‌తో ప్రదీప్ నటించడం చర్చనీయాంశమవ్వడంతో పాటు ఆడియన్స్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. గత నెలలో థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను లాక్ చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ డైరెక్టర్లే దర్శకులు
ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌కు ఒకప్పుడు డైరెక్టర్లుగా పనిచేసిన నితిన్, భరత్ కలిసి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జీఎం సుందర్, రోహిణి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రాన్ని దాదాపు రూ.8 కోట్ల బడ్జెట్‌తో మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై నిర్మించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ చేసింది. విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాలు, టీజర్, ట్రైలర్‌లతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిపై మంచి హైప్ నెలకొంది.
ప్రదీప్ మూవీకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్
సుడిగాలి సుధీర్, శేఖర్ మాస్టర్‌లతో ప్రదీప్ మాచిరాజు చేసిన ఓ వీడియో కూడా ఈ సినిమాకు బాగానే హెల్ప్ అయ్యింది. ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హిట్ కావాలంటే 5 కోట్ల రూపాయల షేర్ .. 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని షేర్ పండితులు విలువ కట్టారు. ఈ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 850 స్క్రీన్‌లలో ప్రదీప్ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా లాంగ్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.1.50 కోట్లు మాత్రమే రాబట్టినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ తెలిపింది.
ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్
కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్‌లో అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఈటీవీ అధికారిక ప్రకటన చేసింది. మే 8 నుంచి ఈటీవీ విన్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరి ఓటీటీలో ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లిల సినిమా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











