Adipurush OTT: 'ఆదిపురుష్'కు తప్పని నిషేధం సెగలు.. ఓటీటీలో కూడా బ్యాన్.. ప్రధానికి లేఖ
ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ప్రభాస్ ఆదిపురుష్ సినిమా. ఇది వరకు ఇండియన్ సినిమాలో అనేకమైన రామాయణ గాథలను వెండితెరపై ఆవిష్కరించారు. అయితే ఎవరికి రానటువంటి తీవ్రమైన నెగెటివిటీని ఆదిపురుష్ తెచ్చుకుటోంది. నిజానికి టీజర్ రిలీజ్ నుంచే విమర్శలు తలెత్తుతున్న మూవీ మేకర్స్ మ్యానేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఆదిపురుష్ విడుదల తర్వాత ఆరోపణలు తీవ్రంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ ను అన్ని మాధ్యమాల్లో నిషేధించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
నటీనటులు: రామాయణం ఆధారంగా రూపొందిన ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. శ్రీరాముడిగా ప్రభాస్ అలరించిన ఈ సినిమాలో పది తలల రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతాదేవిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్, హనుమంతుడిగా మరాఠీ పాపులర్ నటుడు దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ చేశారు. సోనాల్ చౌహన్, తేజస్విని పండిట్, వత్సల్ సేథ్ నటించారు.

మూవీపై ఆగ్రహం: హిందీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాకు టీజర్ రిలీజ్ నుంచే వివాదాలు తలెత్తాయి. ఇక మూవీ విడుదల తర్వాత అంటే జూన్ 16 నుంచి మరింత విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా రాజకీయ నేతలు ఆదిపురుష్ సినిమాపై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిషేధించాలి: ఆదిపురుష్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయాలంటూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. దేశవ్యాప్తంగా ఆదిపురుష్ మూవీ ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని లేఖలో కోరింది. థియేటర్లు, ఓటీటీ వేదికల్లో కూడా సినిమా ప్రదర్శనను నిషేధించాలా ఆదేశించాలని మోదీని అభ్యర్థించింది.

మనోభావాలు దెబ్బ తీసేలా: అంతేకాకుండా ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓం రావత్, రచయిత మనోజ్ శుక్లాపై కేసు నమోదు చేయాలని ప్రధాని మోదీని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కోరింది. సినిమా స్క్రీన్ ప్లే, డైలాగ్స్, రాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని లేఖలో పేర్కొంది. ఆదిపురుష్ హిందువులు, సనాతన ధర్మం, సెంటిమెంట్ ను దెబ్బ తీస్తోంది అని చెప్పుకొచ్చింది.

విశ్వాసం దెబ్బ తినేలా: "దేశంలో రాముడిని ప్రతీ ఒక్కరూ దేవుడిలా ఆరాధిస్తారు. అయితే ఆదిపురుష్ సినిమాలో రాముడిని, రావణుడిని వీడియో గేమ్స్ లో పాత్రల వలే తీర్చిదిద్దారు. సినిమాలోని డైలాగ్ లు భారతీయులను బాధించే విధంగా ఉన్నాయి. భారతదేశ ప్రజలకు రామాయణం అంటే ఒక విశ్వాసం. కానీ ఆ విశ్వసాన్ని దెబ్బ తీసేలా ఆదిపురుష్ తెరకెక్కించారు" అని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధానికి రాసిన లేఖలో మండిపడింది.


Click it and Unblock the Notifications











