Baby OTT: ఇంకా గుండెలను పిండేయాలని ఫిక్స్ అయ్యారు.. 4 గంటల నిడివితో బేబీ ఓటీటీలో రిలీజ్
ఈ మధ్య కాలంలో రిలీజ్ అయి సంచలనం సృష్టించిన మూవీ ఏదీ అంటే టక్కున బేబీ అని చెప్పేస్తారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది బేబీ. కంటెంట్ బాగుంటే జనాలు బ్రహ్మరథం పడతారు అనే విషయం ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. ఇక ఈ సినిమాను త్వరలో ఓటీటీలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఓటీటీలోకి బేబీ మూవీ ఓ ప్రత్యేకతతో రాబోతుంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబీ. ఇక ఈ సినిమాకు హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలు తీసిన సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానీన్ సంగీతం అందించారు. ఇక ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఈ సినిమాను నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించారు.

త్వరలోనే వందకోట్ల మార్కు:బేబీ సినిమా రిలీజ్ అయి 20రోజులు కావొస్తున్న కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గడంలేదు. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ మూవీ 20 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 40.38 కోట్లు షేర్ వసూలు చేయగా... రూ. 85.00 కోట్లు గ్రాస్ రాబట్టింది. త్వరలోనే వంద కోట్ల మార్కు అందుకోనున్నట్లు ట్రెడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు.

త్వరలో ఓటీటీలోకి... :అయితే బేబీ సినిమా త్వరలోనే ఓటీటీలోనూ ప్రసారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ వేదికలు నెట్ ఫ్లిక్స్, ఆహాలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆగస్టు 18వ తేదీ నుంచి ఓటీటీలో ప్రసారం కానున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇప్పుడు బేబీ ఓటీటీ రిలీజ్ గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

నాలుగు గంటల సినిమా... :బేబీ చిత్రం థియేటర్లలో రన్ టైం చూసుకుంటే.. 2 గంటల 55 నిమిషాలు. ఇది పెద్ద నిడివిగల సినిమానే. అయినా.. ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టలేదు. అయితే మొదట ఈ మూవీ నిడివి 4 గంటలు అని తెలుస్తుంది. ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దర్శక నిర్మాతలు కట్స్ చేసి.. దాదాపు 3 గంటలకు తీసుకువచ్చారు. ఇప్పుడు తాజా విషయం ఏమిటంటే... ఓటీటీలో ఎలాంటి కట్స్ లేకుండా నాలుగు గంటల నిడివితో గల సినిమాను రిలీజ్ చేయబోతున్నారట.

బేబీ రికార్డు.. :ఓటీటీలో రిలీజ్ చేయబోయే నాలుగు గంటల బేబీ చిత్రంలో ఓ అదనపు పాటతో పాటు.. వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ నటించిన కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. మరోవైపు ఆనంద్ దేవరకొండ తన తల్లి పాత్రకు సంబంధించిన బాధకరమైన సీన్స్ కూడా యాడ్ చేయనున్నారట. ఓటీటీలో నాలుగు గంటల సినిమా రిలీజ్ చేస్తే.. అలా విడుదలైన మొదటి సినిమా రికార్డు బేబీ సొంతం చేసుకోనుంది. అంతే కాదు.. థియేటర్లలో చూసిన వారంతా మళ్లీ ఓటీటీలో చూసే అవకాశం కూడా ఉంటుంది. ఇక బేబీ మూవీ లవర్స్ కు ఇది పండగ లాంటి వార్త అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











