OTT: ఓటిటిలోకి వస్తున్న ప్రేమిస్తే భరత్ కొత్త చిత్రం.. హార్రర్ లవర్స్ సిద్ధంగా ఉన్నారా..?
బాయ్స్, ప్రేమిస్తే సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు భరత్. బాయ్స్ లో ఎలా ఉన్నా కానీ, ప్రేమిస్తే సినిమాను మాత్రం ఎవరు మర్చిపోలేరు. అమ్మాయి ప్రేమలో పిచ్చోడిగా మారిన అబ్బాయి ప్రేమకథగా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట భరత్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. పిచ్చోడిగా భరత్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి.
ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సినిమా తరువాత తెలుగువారికి కూడా భరత్ సుపరిచితుడుగా మారాడు. ఆ తరువాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించాడు కానీ ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేక పోయాడు. గతేడాది సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.

తెలుగులో హిట్స్ అందుకోలేకపోయిన తమిళ్ లో మంచి మంచి చిత్రాలలో నటిస్తూ మెప్పిస్తున్నాడు భరత్. తాజాగా భరత్ నటించిన ఒక సినిమా తెలుగు ఓటిటీలోకి రాబోతుంది. అదే మిరల్. భరత్ - వాణి భోజన్ జంటగా నటించిన ఈ సినిమాకి శక్తివేల్ దర్శకత్వం వహించాడు. డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. నిజానికి 2022లో తమిళంలో రిలీజైన ఈ సినిమా.. గత నెలలో తెలుగులోనూ రిలీజైంది. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది.
ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ శుక్రవారం అనగా జూన్ 7 నుంచే మిరల్ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ మధ్యకాలంలో హర్రర్ కథలతో వస్తున్న చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

మిరల్ కూడా అదే తరహాలో ఉండబోతుందని తెలుస్తోంది. అసలు మిరల్ కథ ఏంటంటే.. భరత్ - వాణి భార్య భర్తలు. ఒక అర్ధరాత్రి భరత్ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ప్రాణాలతో అయితే బయటపడతాడు కానీ, అతనికి రోజు నైట్ ఒక పీడకల వస్తూ ఉంటుంది. మానసిక పరమైన ఆ ఇబ్బంది నుంచి భర్తను తప్పించడం కోసం అతని భార్య ఒక పరిహారం చేయాలనుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? భరత్ కలలో వస్తున్న పీడకలకు అర్ధం ఏంటి.. ? అనేది కథ.
ఇక హర్రర్ సినిమాలు అంటే ప్రేక్షకులు చూడడానికి ముందు ఉంటారు. అందుకే మిరల్ అప్డేట్ రాగానే ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్ లో సత్తా చూపించలేని మిరల్ ఓటిటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











