10 నెలల తర్వాత ఓటీటీలోకి అనసూయ మూవీ.. ఎందులో అంటే?
థియేటర్‌లలో టికెట్, తినుబండారాల రేట్లు చూసి మధ్యతరగతి వాడికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కుటుంబంతో కలిసి సరదాగా సినిమాకు వెళ్దామన్నా తమ జేబును ఒకటికి పదిసార్లు తడుము కోవాల్సి వస్తోంది. పోనీ ధైర్యం చేసి థియేటర్‌కు వెళ్లినా సినిమా మెప్పించలేక ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతోంది. అందుకే మెజారిటీ ప్రజలు ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. నాలుగు రోజులు పోతే ఇంటిల్లిపాది ఎంచక్కా సినిమాలను చూసేయొచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం చిత్ర నిర్మాతలకు ఓటీటీ రైట్స్ పేరిట అదనపు ఆదాయం లభిస్తోంది. కాస్తంత హైప్ ఉంటే కళ్లు చెదిరే ఫ్యాన్సీ ధర దక్కుతోంది. అలాగని ఇష్టం వచ్చినట్లు ఓటీటీలలో సినిమాను రిలీజ్ చేయడానికి లేదు. ఇందుకు ఎన్నో ఒప్పందాలు, నియమ నిబంధనలు ఉన్నాయి. ఓటీటీ నిబంధనల ప్రకారం.. థియేటర్‌లో వచ్చిన దాదాపు 56 రోజుల ఆపైన తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు ప్రేక్షకులు ఓటీటీ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే కొన్ని సినిమాలు నెలలోపే ఓటీటీలలోకి వస్తే .. మరికొన్ని మాత్రం నెలలు గడిచినా ఓటీటీలోకి రావు. ఇలాంటి వాటిలోకి వస్తుంది స్టార్ యాంకర్ అనసూయ నటించిన రజాకార్. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు.
నిజాం అండ చూసుకుని రజాకార్‌లు సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. దోపిడీలు, లూటీలు, అత్యాచారాలు, హత్యలు వంటి మారణహోమంతో ఈ మూక.. ప్రజలను చిత్రహింసలకు గురిచేసింది. నిజాం పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర భారతదేశంలో ఎలా విలీనం చేశారన్న ఇతివృత్తంతో తీసిన చిత్రమే రజాకార్.

యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడురు నారాయణ రెడ్డి ఈ రజాకార్ సినిమాను నిర్మించారు. అనసూయ భరద్వాజ్, వేదిక, ప్రేమ, ఇంద్రజ, తేజ్ సప్రూ, అనుశ్రీ, రాజ్ అర్జున్ , ప్రేమ, బాబీ సింహా తదితరులు నటించారు. ముఖ్యంగా అనసూయ నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. గతేడాది మార్చి 15న థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. అయినప్పటికీ ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
అయితే ఏడాది గడుస్తున్నా రజాకార్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాకపోవడం షాకిచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శుభవార్త చెప్పింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో జనవరి 24 నుంచి రజాకార్ మూవీనీ వీక్షించవచ్చని, ఆహా గోల్డ్ మెంబర్స్ 48 గంటల ముందే ఈ సినిమాను చూడొచ్చని తెలిపింది.


Click it and Unblock the Notifications











