పవన్ కల్యాణ్ నక్సలైట్ అవుతాడనుకున్నా.. గన్‌తో తిరుగుతుంటే.. సింగర్ స్మితతో చిరంజీవి!
ఓటీటీలు వచ్చాక టాక్ షోలు విపరీతంగా పెరిగాయి. అయితే ఈ టాక్ షోలు తెలుగులో 15 ఏళ్ల క్రితం నుంచే ఉన్నాయి. వాటికి మంచు లక్ష్మీ, రానా దగ్గుబాటి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, జయప్రద, సమంత, బాలకృష్ణ వంటి పాపులర్ సెలబ్రిటీలు హోస్టులుగా వ్యవహరించారు. ఈ షోలలో సినీ, రాజకీయ సెలబ్రిటీలను అతిథులుగా పిలిచి వారి నుంచి అనేకమైన ఇంట్రెస్టింగ్, ఫన్నీ ఆన్సర్స్ రాబడుతుంటారు.
దీంతో టాక్ షోలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఇటీవల అన్ స్టాపబుల్ రెండో సీజన్ పూర్తి కాగా తాజాగా ఓటీటీ వేదికపైకి మరొ కొత్త టాక్ షో వచ్చేసింది. అదే "నిజం విత్ స్మిత". ఈ టాక్ షోకు ఫస్ట్ గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి హాజరై పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

సింగర్ గానే కాకుండా..
ఒకప్పుడు ఎస్పీబాలు, చిత్ర, సుశీల వంటి పాపులర్ గాయకులు ఉన్నసమయంలో పాప్ సింగర్ గా మంచి పేరు తెచ్చున్నారు స్మిత. ఇండియన్ పాప్ సింగర్ గా ఒక వెలుగు వెలిగారు. ఎన్నో బస్తీ దొరసాని, మసక మసక చీకటిలో వంటి ఎన్నో ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నారు.
అలాగే మల్లీశ్వరి వంటి కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించారు సింగర్ స్మిత. అలాగే సింగింగ్ కాంపిటేషన్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఐక్యాండీ ఎంటర్టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి టీవీ షోలు చేస్తున్న స్మిత తాజాగా హోస్ట్ గా మారారు.

ఎపిసోడ్స్ పూర్తి.. ప్రోమోలతో..
ఇండియన్ పాప్ సింగర్, నటిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న స్మిత హోస్ట్ గా మారిన ఆ టాక్ షో "నిజం విత్ స్మిత". ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఫిబ్రవరి 10 నుంచి ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ టాక్ షోకి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యాయి. అంతేకాకుండా వాటి ప్రోమోలను కూడా ఫ్లాట్ ఫామ్ లో పొందుపర్చారు. ఇక వారానికి ఒక గెస్టుతో పూర్తి ఎపిసోడ్ ను విడుదల చేయనున్నారు.

రాజకీయాలు, అవమానాలు..
సోనీ లివ్ వేదికగా ప్రారంభమైన "నిజం విత్ స్మిత" టాక్ షోలో మొదటి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కి "కష్టే ఫలి" అని టైటిల్ పెట్టారు. స్వయంకృషికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయన అతిథిగా హాజరైన ఈ ఎపిసోడ్ కు అలాంటి టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో చిరంజీవికి సంబంధించిన అనేక విషయాలను చర్చించారు. ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు, రాజకీయాలు, ఎదుర్కొన్న అవమానాలపై మాట్లాడారు.

అది ఆట కాదు.. రాక్షస క్రీడ..
ఈ క్రమంలోనే కొన్ని ఫొటోలను స్క్రీన్ పై చూపించి వాటికి సంబంధించిన విషయాలు పంచుకోవాల్సిందిగా సింగర్ స్మిత కోరారు. వాటిలో రామ్ చరణ్, సుష్మితతో మెగాపవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఫొటోను చూపించారు. "అందరం ఒక ఇంట్లోనే ఉండేవాళ్లం.
వాడికి (పవన్ కల్యాణ్) ఆట విడుపు ఏంటంటే.. వీళ్లిద్దరికి (సుష్మిత, రామ్ చరణ్) ఒకరి మీద ఒకరికి చెప్పి వాళ్లిద్దరు కొట్టుకుంటుంటే చూసి పైశాచిక ఆనందం పొందేవాడు. సురేఖ వచ్చి ఏంటీ కల్యాణ్ ఇది అని అంటే.. లేదు వదినా.. వాళ్లు ఆడుకుంటున్నారు అనేవాడు. ఆట కాదది.. రాక్షస క్రీడ అనేది సురేఖ" అని చిరు తెలిపారు.

నక్సల్స్ లోకి వెళ్లిపోతాడా..
అనంతరం పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా ఇష్టమా.. నటుడిగా ఇష్టమా అని అడిగితే.. "పవన్ కల్యాణ్ సహజత్వంగా, తన నేచర్ ను బట్టి అయితే అతను ఏదో ఒక రోజు రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. బాధలకు స్పందించే తీరు, ఏదో చేయాలనే తపన చిన్నప్పటి నుంచి ఉండేది.
ఒకానొక సమయంలో నక్సల్స్ లోకి వెళ్లిపోతాడేమోనని భయమేసింది. గన్ లతో ఎక్కువగా ఆడేవాడు. నేను షూటింగ్ లకు వెళ్లినప్పుడు ఏం కావాలిరా అని అడిగితే.. అన్నయ్య అక్కడ గన్స్ దొరుకుతాయి. ఇక్కడ దొరకట్లేదు తీసుకురా అనేవాడు" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

పవన్ నటుడిగా కన్నా..
ఇంకా చిరంజీవి కొనసాగిస్తూ.. "అవి డమ్మీ గన్సే. సెమీ అటోమేటిక్ తీసుకొచ్చేసేయ్ అనేవాడు. అలా గన్ తో ఒకసారి రైల్వే స్టేషన్ లో తిరిగితే ఆపేశారు. అది డమ్మీ గన్ అని తెలిశాక వదిలేశారు. అతనికి ఉన్న ఫ్యాన్స్ అందరితో పోల్చుకుంటే వేరే రకం. వాళ్లని ఫ్యాన్స్ అనకూడదు.
కల్ట్ అంతే.. భక్తులు. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. తనకు మాత్రం భక్తులు ఉంటారు. కాబట్టి నటుడిగా కన్నా రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన అవసరం అతనికి ఉంది" అని వివరించారు.


Click it and Unblock the Notifications











