Waltair Veerayya OTT: ఓటీటీలోకి వాల్తేరు వీరయ్య.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ అంటే?
దాదాపు 40 ఏళ్లుగా తెలుగు చిత్రసీమలో తన హవాను చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టిన చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్యతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్య విజయోత్సాహాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సినిమా డిజిటల్ తెరపై ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడని ప్రేక్షకుడు లేడు. అందుకే మరి కొన్ని రోజుల్లో ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు వాల్తేరు వీరయ్య.

2022లో ఫ్లాప్.. 2023లో హిట్..
స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. అనేక చిత్రాలతో తన వైవిధ్యమైన నటన చూపిస్తూ టాలీవుడ్ లో బాస్ గా మారారు. అప్పట్లో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన చిరంజీవికి అంతగా కలిసి రాలేదు. దీంతో మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు చిరు. ఖైదీ నెం 786 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే 2022 సంవత్సరంలో ఆచార్యతో ప్లాప్ అందుకున్న చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయం సాధించారు.

ఇద్దరు స్టార్ హీరోలు నటించడంతో..
ఇక 2023 కొత్త సంవత్సరం ఆరంభంలోనే వాల్తేరు వీరయ్యగా సూపర్ హిట్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటించిన ఈ చిత్రంలో వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారంతో చిరంజీవి కనిపించగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా రవితేజ కనిపించాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వాల్తేరు వీరయ్యపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

ప్రతి అప్డేట్ కి క్రేజ్..
ఇక వాల్తేరు వీరయ్య సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందడంతో అంచనాలు ఇంకాస్తా పెరిగాయి. సినిమా విడుదలకు ముందే విడుదలైన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి, వీరయ్య, పూనకాలు లోడింగ్, నీకు అందమెక్కువ.. నాకు తొందరెక్కువ పాటలకు విపరీతమైన స్పందన వచ్చింది. అలాగే టీజర్, ట్రైలర్ కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక మొత్తానికి గ్లామరస్ బ్యూటి శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రూ. 232 కోట్ల గ్రాస్ కలెక్షన్స్..
వాల్తేరు వీరయ్య సినిమాకు మొదటి నుంచే మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా చిరంజీవి నటన.. రవితేజ స్క్రీన్ ప్రజెన్స్ అభిమానులకే కాకుండా ప్రేక్షకులకు సైతం ఎంతో బాగా ఎంటర్టైన్ చేశాయి. అలాగే ఈ సినిమాకు రివ్యూస్ కూడా పాజిటివ్ గా రావడంతో వసూళ్లు కూడా బాగా కలెక్ట్ అయ్యాయి. ఫలితంగా దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచిన వాల్తేరు వీరయ్య చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 135.93 కోట్లు షేర్, రూ. 232.15 కోట్లు గ్రాస్ వచ్చింది.
నెట్ ఫ్లిక్స్ లో ఆరోజు నుంచి..
ఇక వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫిబ్రవరి 6తో 25 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అది కూడా ఫిబ్రవరి 17న రిలీజ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ సౌత్ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.


Click it and Unblock the Notifications











