Court ott release : ఓటీటీలోకి కోర్ట్ .. ప్రియదర్శి చిత్రం ఎప్పుడు? ఎందులో అంటే?
మల్లేశం, బలగం చిత్రాల ద్వారా తనలోని విలక్షణ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశారు ప్రియదర్శి పులికొండ. నవ్వించడమే కాదు.. తనకు ఏడిపించడం కూడా వచ్చని నిరూపించుకున్నారు ప్రియదర్శి. తాజాగా ప్రియదర్శి సీరియస్ రోల్‌లో నటించిన చిత్రం కోర్ట్. పోక్సో చట్టం, భారతీయ న్యాయవ్యవస్థలపై అవగాహన కల్పించేలా తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ వివరాల్లోకి వెళితే..
హీరోగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్‌లు అందుకుంటున్నారు నేచురల్ స్టార్ నాని. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తక్కువ బడ్జెట్‌లో విభిన్నమైన సినిమాలు తీయడంతో పాటు యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు. నాని బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందులో విషయం ఉంటుంది అన్నంతగా ఆయన తనదైన ముద్ర వేశారు. కోర్ట్ చిత్రానికి హీరో నాని సమర్పకుడిగా వ్యవహరించారు.

ప్రియదర్శి, హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించగా.. రామ్ జగదీష్ కోర్ట్ మూవీని డైరెక్ట్ చేశారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కోర్ట్ చిత్రానికి రూ.10 కోట్ల బడ్జెట్ అయ్యింది.
నాని బ్యానర్, ప్రియదర్శి గత చిత్రాల రిజల్ట్స్ నేపథ్యంలో కోర్ట్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఆంధ్రా , నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో ఈ సినిమాకు రూ.10 కోట్ల మేర బిజినెస్ చేసింది. ప్రియదర్శి - నానిల సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.
మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న కోర్ట్.. తొలి రోజు ఏకంగా రూ.5 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసిన కోర్ట్.. 10 రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. థియేట్రికల్ రన్ ముగిసేనాటికి కోర్ట్ సినిమా భారతదేశంలో 40.37 కోట్ల నికర వసూళ్లను .. రూ.46.95 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.10.2 కోట్ల కలెక్షన్స్‌తో కలిపి కోర్ట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.57.15 కోట్లు ఆర్జించింది.
కోర్ట్‌ను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను కళ్లు చెదిరే రేటుకు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఓటీటీ నిబంధనల ప్రకారం థియేటర్‌లలో విడుదలైన 5 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీ ముందుకు రావాల్సి ఉంది. దీని ప్రకారం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. ఏప్రిల్ 11 నుంచి నాని - ప్రియదర్శిల చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లెక్స్ వెల్లడించింది. థియేటర్‌లో హిట్ అయిన కోర్ట్ చిత్రం ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











