Dhurandhar 2 on OTT: ఓటీటీలోకి ధురంధర్ 2.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?
ధురంధర్ ది రివెంజ్ చిత్రం థియేటర్లలో ఇంకా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూనే ఉంది. దాదాపు గత 30 రోజులుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నది. అయితే ఈ చిత్రం ఇప్పటికే బాలీవుడ్‌లో షారుక్, సల్మాన్, అమీర్ ఖాన్ లాంటి హీరోల సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించింది. థియేట్రికల్‌గా స్ట్రాంగ్‌గా వసూళ్లను సాధిస్తున్నది. అయితే ఈ సినిమా థియేటర్లలో కొనసాగుతున్న నేపథ్యంలోనే ఓటీటీలో ప్రభంజనం సృష్టించేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఏ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.

ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ తేదీన రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి ఆట నుంచి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చూస్తూ దూసుకెళ్తున్నది.
ధురంధర్ 2 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో 1316 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు, 1099 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 417 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 1734 కోట్ల రూపాయలను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.
గతంలో ఏ బాలీవుడ్ సినిమా సాధించని విధంగా రికార్డులు తిరగరాసిన ధురంధర్ 2 ఇక ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నది. ఈ చిత్రం జీయో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమాతో ఓటీటీ చేసుకొన్న ఒప్పందం, అలాగే బాలీవుడ్‌లో ఉన్న అగ్రిమెంట్, నిబంధనల ప్రకారం 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ కానున్నది. తాజా సమాచారం ప్రకారం.. మే 14వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నది అని ఓటీటీ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే రికార్డు స్థాయిలో ధురంధర్ 2 చిత్రం ఫుట్‌ఫాల్స్ నమోదు చేసుకొన్నది. దేశవ్యాప్తంగా అత్యధిక మంది ప్రేక్షకులు చూసిన చిత్రాల్లో ఒకటిగా రికార్డులోకెక్కింది. థియేటర్‌లోనే కాకుండా ఈ చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకులు చూసేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఓటీటీలో కూడా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications