Saas Bahu Aur Flamingo Review: డ్రగ్స్ సామ్రాజ్యంలో అత్తా కోడళ్ల కథ.. 'అత్త కోడలు ఓ ఫ్లెమింగో' రివ్యూ
రేటింగ్: 2.5/5
టైటిల్: సాస్ బహు ఔర్ ఫ్లెమింగో (అత్త కోడలు ఓ ఫ్లెమింగో)
నటీనటులు: డింపుల్ కపాడియా, ఇషా తల్వార్, రాధిక మదన్, అంగీరా ధర్, దీపక్ డోబ్రియాల్, జిమిత్ త్రివేది, వరుణ్ మిత్ర, ఆశిష్ వర్మ, ఉదిత్ అరోరా, నసీరుద్దీన్ షా, ప్రియాష భరద్వాజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: లినేష్ దేశాయ్
సంగీతం: సచిన్ జిగర్
నిర్మాతలు: రోహిత్ కౌల్, పార్థ్ మనోచా
మాటలు: కరన్ వ్యాస్
దర్శకత్వం: హోమి అదజానియా
విడుదల తేది: మే 5, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఎపిసోడ్స్: 8, నిడివి: ఒక్కో ఎపిసోడ్ సుమారు 50 నిమిషాలు
ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వివిధ జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీసులు తెరకెక్కిస్తూ సినీ ప్రేమికులను ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా 'సాస్ బహు ఔర్ ఫ్లెమింగో' అనే వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చింది హాట్‌స్టార్ స్పెషల్స్. దీనికి తెలుగులో 'అత్త కోడలు ఓ ఫ్లెమింగో' అని అర్థం.

బాలీవుడ్ సీనియర్ నటి డింపుల్ కపాడియా ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీసులో 'గుండెజారి గల్లంతయ్యిందే' ఫేమ్ ఇషా తల్వార్ మరో కీలక పాత్ర పోషించింది. డ్రగ్స్, క్రైమ్ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మరి ఎలా ఉందో (Saas Bahu Aur Flamingo Telugu Review) రివ్యూలో తెలుసుకుందాం.
కథ:సావిత్రి అలియాస్ రాని మా (డింపుల్ కపాడియా) రంజ్ ప్రదేశ్ (కల్పిత రాష్ట్రం) రాష్ట్రంలో తూర్పు భాగమైన సిల్వర్ రింగ్ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నడిపిస్తుంటుంది. రాని కార్పోరేటివ్ సంస్థ పేరుతో హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారు చేస్తూనే వాటి ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తుంటుంది.
ఈ డ్రగ్స్ డీలింగ్ లో రాని మాకు ఆమె కోడళ్లు బిజిలీ (ఇషా తల్వార్), కాజల్ (అంగీరా ధర్), కూతురు శాంత (రాధిక మదన్), పెంచిన కొడుకు ధీమన్ (ఉదిత్ అరోరా) సహాయం చేస్తూ అందులో ఒక్కో పాత్ర పోషిస్తుంటారు.

ట్విస్టులు.. ఆసక్తికర అంశాలు: కృష్ణాష్టమికి కొన్ని రోజుల ముందుగా రాని మా హవేలిపై అత్యంత క్రూరులైన మగాడియా గ్యాంగ్ తో మంక్ (దీపక్ డోబ్రియాల్) దాడి చేయిస్తాడు. కానీ రాని మా కుటుంబం మగాడియాలను మట్టుబెడుతుంది. అదే సమయంలో అమెరికా నుంచి రాని మా కొడుకులు హరీష్ (ఆశిష్ వర్మ), కపిల్ (వరుణ్ మిత్ర) వస్తారు. కొడుకుల వచ్చిన తర్వాత రాని మా కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులు ఏంటీ? రాని మాగా సావిత్రి ఎందుకు మారాల్సి వచ్చింది?
ఆమెకు మంక్ కు ఉన్న వైరం ఏంటీ? రాని డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాని మాను పట్టుకునేందుకు వచ్చిన నార్కోటిక్స్ ఏసీపీ (ప్రోషున్ జైన్) ఏం కనుక్కున్నాడు? చివరికీ అతనికి ఏమైంది? పొలిటీషియన్ సాహెబ్ జీ (నసీరుద్దీన్ షా), రానిమాకు ఉన్న సంబంధం ఏంటీ? తన సామ్రాజ్యపు వారసత్వాన్ని రాని మా ఎవరికీ కట్టబెట్టింది? వంటి ఇంట్రెస్టింగ్ అంశాల కథే 'సాస్ బహు ఔర్ ఫ్లెమింగో'

విశ్లేషణ: ఇది వరకు హాట్‌స్టార్ స్పెషల్ గా వచ్చిన సుస్మితా సేన్ 'ఆర్య' వెబ్ సిరీస్ తరహాలోనే 'సాస్ బహు ఔర్ ఫ్లెమింగో' ఉంటుంది. అయితే ఇందులో ఫ్యామిలీ అంతా డ్రగ్స్ బిజినెస్ నడుపుతుంటారు. టైటిల్ లోని ఫ్లెమింగోకు అర్థం అదొక రకమైన డ్రగ్స్. అలాంటి ఫ్లెమింగోను తీసుకున్న డిప్యూటీ సీఎం కొడుకు అందులో కల్తీ జరగడం వల్ల చనిపోతాడు.
ఆ డ్రగ్స్ ను ఎవరూ సరఫరా చేశారు.. ఎవరు తయారు చేశారనే విషయాలను కనుక్కోవాల్సిందిగా పోలీసులకు డిప్యూటీ సీఎం ఆదేశిస్తారు. ఈ సన్నివేషంతో ఉత్కంఠంగా వెబ్ సిరీస్ ప్రారంభం అవుతుంది.

డ్రగ్స్ కుటుంబం: సిరీసులో డ్రగ్స్ ను తన హవేలిలోనే తయారు చేయడం, వివిధ హ్యాండ్ క్రాఫ్ట్స్ లలో డిస్ట్రిబ్యూట్ చేయడం, వాటికి రాని మా కోడళ్లు సహాయం చేయడం వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. చూడటానికి వాళ్లు పాతకాలం మనుషులుగా కనిపించినా వారు ఉపయోగించే టెక్నాలజీ వావ్ అనిపిస్తుంది.
డ్రగ్స్ సామ్రాజ్యాన్ని కుటుంబం పాలించడం, వారిలో వచ్చే మనస్పర్థలు, కుటుంబ బంధాలు, అఫైర్స్, పీఠం దక్కించుకునేందుకు వారిలో వారే పడే పోటీ, రాని మా ఫ్లాష్ బ్యాక్, ఆమె సామ్రాజాన్యి చేజిక్కుంచుకునేందుకు మంక్ గ్యాంగ్ చేసే ప్రయత్నాల సమ్మేళనమే ఈ సిరీస్.

చప్పగా ఇన్వెస్టిగేషన్: ఇదివరకు చూసిన స్టోరీలానే అనిపించినా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో మహిళలను చాలా శక్తిమంతంగా చూపించారు. వారు చేసే ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయాయి. శాంత క్యారెక్టర్ రాధిక మదన్ ఫైట్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. అయితే రాని మా ఫ్లాష్ బ్యాక్ ఫుల్లీ ఎమోషనల్ గా ఉన్నా.. మంక్ తోని వైరం చాలా చప్పగా చూపించారు.
ఏసీపీ ఇన్వెస్టిగేషన్ పెద్ద ప్రభావం చూపించదు. ఎక్కువ ఎపిసోడ్స్, లెంతీ టైమ్ ఉండటంతో కాస్తా బోరింగ్ గా ఉంటుంది. అనవసరపు సన్నివేశాలు కూడా ఉన్నాయి. అంతా సమయం తీసుకున్నా కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వకుండా అలానే వదిలేశారు.
క్లైమాక్స్ ట్విస్ట్ అలా: 'సాస్ బహు ఔర్ ఫ్లెమింగో' సీజన్ 2 కోసం కొన్ని పాయింట్స్ వదిలేసినా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సూపర్బ్ గా ఉంది. ఆ ఒక్కటి సీజన్ 2కి హింట్ ఇవ్వడానికి సరిపోతుంది. ఆశిష్ వర్మ కామెడీ సీన్లు వర్కౌట్ కాలేదు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎమ్ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నిర్మాణ విలువలు అంతా బాగున్నాయి.

ఎవరెలా చేశారంటే?: డింపుల్ కపాడియా రాని మాగా అదరగొట్టారనే చెప్పాలి. నాయకురాలిగా, తల్లిగా, అన్నీ కోల్పోయిన మహిళగా వివిధ రకాల ఎమోషన్స్, గ్రే షేడ్స్ తో హావా భావాలు సూపర్బ్ గా పలికించారు. ఇషా తల్వార్, రాధిక మదన్, అంగీరా ధర్ నటనతో ఆకట్టుకున్నారు. విలన్ గా దీపక్ డోబ్రియాల్ బాగా చేశాడు. ఇక అసమర్థ కొడుకులుగా వరుణ్ మిత్ర, ఆశిష్ వర్మ ఒదిగిపోయారు.
అమాయకుడి నుంచి నాయకుడిగా ఎదిగేందుకు మారే కపిల్ పాత్రలో వరుణ్ మిత్ర బాగా చేశాడు. ఇక జూనియర్ సావిత్రిగా ప్రియాష భరద్వాజ్ సైతం ఆకట్టుకుంది. మిగతా క్యారెక్టర్స్ అందరూ పరిధి మేరకు బాగా చేశారు.
ఫైనల్ గా చెప్పాలంటే?: డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నడిపే ఓ మహిళ కథే 'సాస్ బహు ఔర్ ఫ్లెమింగో'. ఆ మహిళకు ఆమె కుటుంబం ముఖ్యంగా కోడళ్లు ఎలా సహకరించారో చూపించారు. ఎపిసోడ్స్, నిడివి ఎక్కువైనా మహిళల యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫ్రీ టైమ్ ఉంటే ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











