మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్‌కు చుక్కలు చూపించిన దుల్కర్.. ఓ రేంజ్‌లో లక్కీ భాస్కర్ రికార్డు!
ప్రస్తుతం థియేటర్‌లతో సమానంగా ఓటీటీ మాధ్యమంలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులు కూడా సినిమాను ఓటీటీలలో చూసేందుకే ఇష్టపడుతున్నాడు. రిలీజ్ రోజు థియేటర్‌కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టడం కంటే నాలుగు రోజులు వెయిట్ చేస్తే సుఖంగా ఇంట్లోనే చూడొచ్చనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేస్తున్నారు. ఓటీటీ రంగం పరిధి నానాటికీ విస్తరిస్తూ ఉండటంతో ఇటువైపు మరిన్ని సంస్థలు వస్తున్నాయి.
కొత్త సినిమా రిలీజ్ అయ్యిందో లేదో వెంటనే ఆ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అంటూ వెంటనే డిస్కషన్లు మొదలైపోతున్నాయి. థియేటర్‌లోకి వచ్చిన నాలుగు నుంచి ఐదు వారాల తర్వాత సినిమాలను ఓటీటీలలోకి రిలీజ్ చేయాలనే నిబంధను టాలీవుడ్ టూ బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు అమలు చేస్తున్నాయి. అయితే థియేట్రికల్ బిజినెస్ బాగుంటే కాస్త ఆలస్యంగా ఓటీటీలలోకి సినిమాలు వస్తున్నాయి. నెలలు ఓటీటీ రిలీజ్ ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి.

థియేటర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాగే థియేటర్‌లో ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న చిత్రాలను ఓటీటీ ప్రేక్షకులు తిప్పికొట్టిన ఘటనలు ఉన్నాయి. ప్రేక్షకుడి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు? వారికి ఏ చిత్రం కనెక్ట్ అయితే దానిని ఆదరిస్తారు. థియేటర్‌లో ఎన్ని రోజులు ఆడింది? ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది? ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసింది అనేది ఎప్పటి నుంచో చూస్తున్నదే. అలాగే ఓటీటీలలోనూ పలు రికార్డులు ఇటీవలి కాలంలో నమోదవుతున్నాయి.
2024లోనూ వందల కొద్ది చిత్రాలు పలు ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో రిలీజ్ అయ్యాయి. వీటిలో కొన్ని ప్రేక్షకుల ఆదరణను పొందితే, మరికొన్ని అడ్రస్ లేకుండా పోయాయి. అలా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో పలు తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ ఓటీటీలలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

అక్టోబర్ 31, 2024న విడుదలైన ఈ సినిమా థియేటర్‌లలో విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకుంది. ఈ క్రమంలో లక్కీ భాస్కర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు 13 వారాల పాటు ట్రెండ్ అయిన తొలి దక్షిణ భారత చిత్రంగా లక్కీ భాస్కర్ నిలిచింది.
ఇప్పటి వరకు ఈ సినిమాను దాదాపు 19.4 మిలియన్ల మంది వీక్షించారు. అలా ఇప్పటి వరకు టాప్ ప్లేస్‌లో నిలిచిన హాయ్ నాన్న (17.3) రికార్డును లక్కీ భాస్కర్ బద్ధలు కొట్టింది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన గుంటూరు కారం (16.6 మిలియన్లు), సలార్ (15.4 మిలియన్లు), దేవర (12 మిలియన్లు), కల్కి హిందీ (10.3 మిలియన్లు) రికార్డులను దుల్కర్ సల్మాన్ బద్ధలు కొట్టాడు. ఈ సినిమా ఊపు చూస్తుంటే మరిన్ని రికార్డులను బద్దలు కొట్టినా ఆశ్చర్చపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











