Good Bad Ugly OTT : ఓటీటీలోకి అజిత్ 250 కోట్ల బ్లాక్‌బస్టర్ .. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలతో జోరు మీదున్నారు. ఈ ఏడాది ఇప్పటికే విదాముయార్చితో అభిమానులను పలకరించిన ఆయన నెల తిరిగేసరికి గుడ్ బాడ్ అగ్లీతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష కృష్ణన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో భారీ అంచనాలు నెలకొన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా.. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ప్రభు, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, రాహుల్ దేవ్, యోగి బాబు, ప్రియా ప్రకాష్ వారియర్, టామ్ చాకో తదితరులు గుడ్ బ్యాడ్ అగ్లీలో కీలకపాత్రలు పోషించారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ బడ్జెట్ & బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి గుడ్ బ్యాడ్ అగ్లీకి దాదాపు రూ.270 కోట్లకు పైగా బడ్జెట్‌తో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అజిత్ మార్కెట్ దృష్ట్యా గుడ్ బ్యాడ్ అగ్లీకి అదిరిపోయే రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాంలో రూ.5 కోట్లు , తమిళ, కన్నడ, మలయాళం , రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి ప్రపంచవ్యాప్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీకి రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.

గుడ్ బ్యాడ్ అగ్లీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
రొమియోక్చర్స్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని, కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ని, శ్రీగోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్‌ని, ప్రత్యంగిరా సినిమాస్ యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ని సొంతం చేసుకున్నాయి. అంటే అజిత్ సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని విలువ కట్టారు. గుడ్ బ్యాడ్ అగ్లీపై అంచనాల నేపథ్యంలో . ఒక్క తమిళనాడులోనే తొలి రోజు ఏకంగా 2400 స్క్రీన్‌లలో ఈ సినిమాను విడుదల చేశారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్స్ :
ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. తొలి రోజు రూ.40 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా 23 రోజుల వరకు ఇండియాలో రూ.153.18 కోట్ల నెట్.. రూ.179.1 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో రూ.14.3 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.6.38 కోట్లు, తమిళనాడులో రూ.151.16 కోట్లు, కేరళలో రూ.5.13 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.03 కోట్లు చొప్పున మొత్తంగా ఇండియా వైడ్ రూ.179 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్‌లో వచ్చిన రూ.66 కోట్ల కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు అజిత్ చిత్రం రూ.245.1 కోట్లు రాబట్టింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు :
ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని ఆ సెక్షన్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.95 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా కోలీవుడ్ టాక్. ఒప్పందం ప్రకారం మే 2వ వారంలో అజిత్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే నెల తిరక్కుండానే గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. మే 8 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అజిత్ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. మరి ఓటీటీలో గుడ్ బ్యాడ్ అగ్లీ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











