OTT: థియేటర్-ఓటీటీలో ఒకేసారి ఆ హీరో సినిమా.. సరికొత్త యాప్‌లో రిలీజ్
ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎక్కువ అవుతోంది. థియేటరల్లో సినిమాల్లో చెప్పలేని, చూపించలేని కథలను వెబ్ సిరీసులు, డిఫరెంట్ జోనర్ల సినిమాల రూపంలో ఆవిష్కరిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఎప్పటికప్పుడు కొత్త ఓటీటీలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. అయితే సాధారణంగా థియేటర్లలో, నేరుగా ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. లేదా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతాయి. కానీ ఈ హీరో సినిమా మాత్రం ఒకే సమయంలో అటు థియేటర్.. ఇటు ఓటీటీలో అది కూడా కొత్త ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుంది. మరి ఆ హీరో, ఆ సినిమా, ఆ ఓటీటీ యాప్ ఏంటనే వివరాల్లోకి వెళితే..
ఆనందం హీరో: సొంతం, వెంకీ, ఢీ, రెడీ, దుబాయ్ శీను, కింగ్, దూకుడు వంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించిన శీను వైట్ల ఫుల్ లెంత్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన సినిమా ఆనందం. శ్రీను వైట్ల తన కెరీర్ లో డైరెక్ట్ చేసిన రెండో చిత్రమైన ఆనందంతో జై ఆకాష్ (Jai Akash) హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా అప్పట్లో ఎంత హిట్ అయిందో తెలిసిందే. అలాంటి ఆనందం సినిమా హీరో జై ఆకాష్ తాజాగా నటించిన తమిళ చిత్రం యోగ్యన్ (Yokkiyan 2023 Movie).

నటీనటులు: మూన్ స్టార్ పిక్చర్స్ బ్యానర్ పై మాదేశ్ నిర్మించిన యోగ్యన్ సినిమాలో జై ఆకాష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఆయన సరసన కవిత, ఆర్తి, ఖుషీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో జై ఆకాష్ శిష్యుడు సాయి ప్రభా మీనా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అలాగే యోగ్యన్ మూవీకి జూపిన్ సంగీతం అందించగా.. పాల్ పాండి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇందులో జై ఆకాష్ తండ్రీ కొడుకులుగా డ్యుయల్ రోల్ చేస్తున్నాడు.

ఇదే కథ: ఓ చెడ్డవాడైన తండ్రికి పుట్టిన కొడుకు ఎలా మారతాడన్న కథతో రూపొందిన సినిమా యోగ్యన్. ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై వడపళనిలో శిఖరం ఆవరణలో సినిమా యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. "విలన్ పాత్రలో నటించాలన్న నా చిరకాల కల ఈ సినిమాతో నెరవేరింది. ఇందులో తండ్రీ కొడుకులుగా నటించేందుకు చాలా కష్టపడ్డాను. సినిమా బాగా వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడం ఎంత కష్టంగా మారిందో తెలిసిందే" అని జై ఆకాష్ తెలిపాడు.

రూ. 50 చెల్లిస్తే: "యోగ్యన్ సినిమాకు మాకు చాలా తక్కువ థియేటర్లు దొరికాయి. అందుకే యోగ్యన్ సినిమాను థియేటర్లతోపాటు ఒకేసారి ఓటీటీలోనూ విడుదల చేస్తున్నాం. ఇందుకోసం 'ఏ క్యూబ్ మూవీస్' (A Cube Movies App) అనే సరికొత్త ఓటీటీ యాప్ ను ప్రారంభించాం. ఓటీటీలో రోజుకు రూ. 50 చెల్లిస్తే ఫోన్ లో, టీవీల్లోనూ ఒక రోజంతా చూడవచ్చు" అని జై ఆకాష్ వెల్లడించాడు.
80 శాతం ఆదాయం: "ఓటీటీలో మా సినిమాలతో పాటు ఇతర చిత్రాలను రిలీజ్ చేస్తాం. చిన్న నిర్మాతలకు, నటీనటులకు ఈ ఓటీటీ చాలా ఉపయోగపడుతుంది. ఇతర చిత్రాలను ఏ క్యూబ్ మూవీస్ యాప్ లో విడుదల చేస్తే ఆ నిర్మాతలకు వచ్చే ఆదాయంలో 80 శాతం వాళ్లకు, 20 శాతం మా సంస్థకు చేరుతుంది" అని జై ఆకాష్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా జూలై 28న విడుదలైంది.


Click it and Unblock the Notifications











