Jana Nayagan: షాకిచ్చేలా జన నాయగన్ కొత్త ఓటీటీ డీల్? విజయ్ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?
కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా సెన్సార్, తదితర వివాదాల్లో చిక్కుకుని వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న దానిపైనా క్లారిటీ లేదు. ఈ వివాదం కొనసాగుతుండగానే జన నాయగన్ మూవీకి సంబంధించిన క్లిప్స్‌తో పాటు ఏకంగా సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం కలకలం రేపింది. సినిమా విడుదలపై క్లారిటీ లేకపోవడంతో జన నాయగన్‌పై ఉన్న హైప్ తగ్గిపోతోంది. ఇది సినిమా బిజినెస్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్‌కి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
జన నాయగన్ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. దళపతి విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, సునీల్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జన నాయగన్ మూవీని దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు, అత్యంత సున్నితమైన అంశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్.. జన నాయగన్ విడుదలకు ఆమోదముద్ర వేయలేదు. దాంతో నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ నిరాశే ఎదురైంది. నిర్మాతల పోరాటం కొనసాగుతున్న దశలో జన నాయగన్ మూవీ క్లిప్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంతో చిత్ర యూనిట్ షాకైంది. ఆ తర్వాత ఏకంగా సినిమా మొత్తం కనిపించడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. అన్ని పరిశ్రమలకు చెందిన నటీనటులు జన నాయగన్‌కు అండగా నిలిచారు.
అయితే ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత జన నాయగన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మే 8న జన నాయగన్ విడుదలవుతుందని కొందరు, లేదు లేదు.. జూన్‌లో వస్తుందని మరికొందరు వాదిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో భారీ సినిమాలు రిలీజ్‌లు పెట్టుకున్న నేపథ్యంలో జన నాయగన్ కనుక బరిలోకి దిగితే బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పదని అంటున్నారు.
ఇదిలాఉండగా.. జన నాయగన్‌పై హైప్ తగ్గిపోవడంతో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌లు ప్రమాదంలో పడ్డాయి. గతంలో భారీ రేటుకు ఈ సినిమా హక్కులను కొన్నవారు.. తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక రికార్డ్ ధరతో జన నాయగన్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ... ఈ డీల్ రద్దు చేసుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. దళపతి విజయ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపు 120 కోట్ల రూపాయలు వెచ్చించి అమెజాన్ దక్కించుకుంది. ఈ డీల్ కోలీవుడ్‌లోనే హాట్ టాపిక్‌గా మారింది. అయితే సినిమా ఇప్పట్లో రిలీజయ్యే పరిస్ధితులు లేకపోవడం, బజ్ రోజురోజుకు తగ్గిపోతుండటంతో డీల్ క్యాన్సిల్ చేయాలని అమెజాన్ భావించిందట.
మరోవైపు.. అమెజాన్ ఈ మూవీ డిజిటల్ పార్ట్‌నర్‌గా తప్పుకునేందుకు సిద్ధమైన నేపథ్యంలో మరో ఓటీటీ సంస్థ జీ5 ముందుకొచ్చిందట. జన నాయగన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఈ సంస్థ 50 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చిందట. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ఇంతకుమించి ధర లభించే సూచనలు కనిపించకపోవడంతో నిర్మాతలు కూడా ఓకే చెప్పేందుకు సుముఖంగా ఉన్నారట. ఒకవేళ ఈ డీల్ పట్టాలపైకి ఎక్కితే.. జన నాయగన్ నిర్మాతలకు ఓటీటీ బిజినెస్ పరంగా దాదాపు 71 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications