డార్క్ రూమ్‌లో ఏం జరిగింది?.. ఓటీటీలోకి 50 కోట్ల సంచలనం , ఎందులో అంటే?
గతేడాది తమిళ చిత్ర పరిశ్రమ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోంది. అగ్రనటులు నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ అయ్యాయి. 241 సినిమాలు కోలీవుడ్ నుంచి వస్తే వాటిలో 223 సినిమాలు ఫ్లాప్ అయి, కేవలం 18 సినిమాలు మాత్రమే గెలుపు తీరాన్ని తాకాయి. దీని కారణంగా నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు రూ.1000 కోట్ల వరకు నష్టాలు చవిచూశాయి. కొత్త ఏడాదైనా తమ సినిమాలు బాగా ఆడాలని అక్కడి సినీ జనాలు కోరుకుంటున్నారు.
భారతీయుడు 2, తంగలాన్, కంగువా, వేట్టయాన్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు బోల్తా కొట్టా.. చిన్నా చితకా సినిమాలు కోలీవుడ్ పరువును కాపాడాయి. వీటిలో కొన్ని సినిమాలు మేజిక్ చేసినట్లుగా కాసుల వర్షం కురిపించాయి. సాదా సీదా సినిమాలే కోట్ల రూపాయల వసూలు చేసి నిర్మాతలను ఒడ్డునపడేశాయి. 3 వేల కోట్ల పెట్టుబడిలో రూ.2 వేల కోట్ల వరకు రికవరీ అయ్యాయంటే అది ఈ చిన్న సినిమాల వల్లనే అంటే అతిశయోక్తి కాదు. భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్టింగ్ కంటే కథను, కంటెంట్‌ను నమ్ముకోవాలని ఆయా సినిమాలు దర్శక, నిర్మాతలకు గుణపాఠం నేర్పించాయి.

ఇలాంటి వాటిలో ఒకటి బ్లాక్ . జీవా, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఈ సినిమా వారిద్దరికి చాలాకాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. కేజీ బాలసుబ్రమణి దర్శకత్వం వహించారు. బ్లాక్‌లో వివేక్ ప్రసన్న, షా రా, స్వయం సిద్ధా, సింధూరి, రాజా రుద్రకోడి తదితరులు కీలకపాత్ర పోషించారు. సామ్ సీ స్వరాలు అందించిన బ్లాక్‌ను పొటెన్షియల్ స్టూడియో ఎల్ఎల్‌పీ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, పీ గోపీనాథ్, తంగ ప్రభాహారన్‌లు రూ.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. 11 అక్టోబర్ 2024న తమిళంలో రిలీజైన బ్లాక్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. లాంగ్ రన్‌లో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కోలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
సూపర్ మూన్ నాడు ఓ బీచ్ ఒడ్డున ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఏం జరిగింది? ఓ కొత్త జంటకు డార్క్ రూమ్‌లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? 1964 నాడు అదే ప్రాంతంలో జరిగిన జంట హత్యలకు 2024తో సంబంధం ఏంటీ? ఈ చిక్కులను తప్పించుకోవడానికి హీరో ఏం చేశాడన్నదే బ్లాక్ కథ. సస్పెన్స్, థ్రిల్లర్, సైన్స్ ఫిక్సన్ చిత్రాలను ఇష్టపడే వారిని ఆకట్టుకున్న ఈ చిత్రం దాదాపు నాలుగు నెలల తర్వాత తెలుగు వారిని పలకరించేందుకు సిద్ధమైంది. డార్క్ పేరుతో తెలుగులో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

డార్క్ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం , ప్రకటన లేకుండానే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షం కావడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆల్రెడీ ఈ సినిమాను చూసిన వారు దీనికి సంబంధించి నెట్టింట డిస్కస్ చేస్తున్నారు. సో.. ఇంకేందుకు ఆలస్యం ఈ డార్క్‌ను చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











