ఓటీటీలోకి ముగ్గురు కీలాడీ లేడీల మూవీ.. 150 కోట్లు రాబట్టిన ఇది ఎందులో ఉందంటే!
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయన్న విషయం తెలిసిందే. ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ తరహా సినిమాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో మేల్ మల్టీస్టారర్లతో పాటు ఫీమేల్ మల్టీస్టారర్ మూవీలు కూడా అధిక సంఖ్యలోనే వస్తున్నాయి. అలా ఇటీవలే విడుదలైన క్రేజీ సినిమానే 'క్రూ' (Crew).
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కరీనా కపూర్, టబు, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే 'క్రూ'. రాజేష్ ఏ కృష్ణన్ తెరకెక్కించిన ఈ చిత్రం క్రైమ్ కామెడీ జోనర్‌లో రూపొందింది. ముగ్గురు ఎయిర్ హోస్టెస్‌లకు అనుకోకుండా బంగారం దొరకడం, ఆ తర్వాత దాన్ని వాళ్లు ఎలా దాచుకున్నారు? అనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ముగ్గురు స్టార్ హీరోయిన్ల కలయికలో రూపొంది భారీ అంచనాల నడుమ ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చిన 'క్రూ' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడంలో పూర్తిగా సఫలం అయింది. దీంతో ఫుల్ రన్‌లో రూ. 150 కోట్లు వరకూ రాబట్టింది.
నవ్విస్తూనే థ్రిల్ చేసే 'క్రూ' సినిమాపై మొదటి నుంచీ అంచనాలు భారీ స్థాయిలోనే ఉండడంతో.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులకు అదిరిపోయే పోటీ ఏర్పడింది. దీంతో మంచి డిమాండ్ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లు బాలీవుడ్ మీడియా ద్వారా తెలిసింది.

'క్రూ' సినిమాను మే 24 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తామని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో సెన్సార్‌లో కట్ అయిన సన్నివేశాలతో పాటు కొన్ని డైలాగులను కూడా యాడ్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్‌లో సైతం మంచి ఆదరణ సొంతం అవుతోంది.
ఇదిలా ఉండగా.. కరీనా, టబు, కృతి సనన్ కాంబోలో రూపొందిన 'క్రూ' మూవీని బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిలిమ్స్ అండ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ బ్యానర్లపై అనిల్ కపూర్, శోభాకపూర్, ఏక్తాకపూర్, రియా కపూర్ సంయుక్తంగా తెరకెక్కించారు. దిల్జీజ్ దోసాంజ్, కపిల్ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఏడుగురు ప్రముఖులు సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











