MAX OTT : 60 కోట్ల వసూళ్లతో సంచలనం.. ఓటీటీలోకి సుదీప్ యాక్షన్ థ్రిల్లర్, ఎందులో అంటే?
కన్నడ నటుడు కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన ఆయన సౌత్‌లో స్టార్ స్టేటస్ అందుకున్నారు. వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్‌లలో నటిస్తున్న సుదీప్ కెరీర్‌లో మరింత ఉన్నత స్థానానికి చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మాతృభాష కన్నడంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ అసలు సిసలు పాన్ ఇండియా స్టార్‌గా నిలిచారు . నటుడిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గానూ రాణించి తాను మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు సుదీప్. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన కన్నడ బిగ్‌బాస్ సీజన్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే.
తాజాగా సుదీప్ నటించిన చిత్రం మ్యాక్స్. విజయ్ కార్తీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మ్యాక్స్ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను, కిచ్చా సుదీప్‌లు సంయుక్తంగా నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, ఇళవరసు, ఆడుకాలం నరేన్, ప్రమోద్ శెట్టి, కరణ్ ఆర్యలు కీలకపాత్ర పోషించారు.

నటీనటుల , సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమా రూ. 65 కోట్ల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లతో మ్యాక్స్ మూవీకి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. జీ కన్నడ ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఏకంగా రూ. 28 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. డిసెంబర్ 25న తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, మంత్రుల కుమారుల మరణం, పోలీస్ స్టేషన్‌పై ఓ గ్యాంగ్ దాడి చేయడం, దానిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? ఆ మంత్రుల కుమారులు ఎందుకు చనిపోయారు? ఎవరు చంపారు? అన్నదే సినిమా కథ. సుదీప్ నటన, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎంలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించిన మ్యాక్స్ దుమ్మురేపింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

సుదీప్ అభిమానులు మ్యాక్స్‌ను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూస్తామా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఓటీటీ సంస్థ జీ 5 స్పందించింది. ఫిబ్రవరి 22 నుంచి మ్యాక్స్‌ను ఓటీటీలో అందుబాటులో ఉంచుతామని జీ5 అధికారికంగా ప్రకటించింది. దీంతో కిచ్చా అభిమానులు ఈ సినిమా పోస్టర్లు, సుదీప్ లుక్స్‌ను షేర్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. మరో 14 రోజుల్లో మ్యాక్స్ ఓటీటీలో సందడి చేయనుంది.


Click it and Unblock the Notifications











