L2 Empuraan OTT Release: మోహన్‌లాల్ మూవీ ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే ఆఫర్.. ఏ ప్లాట్‌ఫాంలో అంటే?
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ - పృథ్వీరాజ్ సుకుమారన్‌ల కాంభినేషన్‌లో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ఎల్2 : ఎంపురాన్. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. రంజాన్ పండుగ కానుకగా ఈ చిత్రం మార్చి 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు అన్ని భాషల్లో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమాలు, గత లూసిఫర్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్ కారణంగా ఈ సినిమాకు దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, సాయికుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్లు, మోహన్ లాల్ - పృథ్వీరాజ్ కాంభో కారణంగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇండియా వైడ్‌గా రూ.70 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ.30 కోట్ల చొప్పున ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఎంపురాన్ చిత్రంపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమలోనే తొలిసారి రూ.300 కోట్లు సాధించిన మూవీగా నిలుస్తుందని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజ్ వ్యాఖ్యానించారు. దీనిని నిజం చేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీ సేల్స్ విషయంలో ఎంపురాన్ దుమ్మురేపుతోంది. ఈ సినిమా తొలి రోజు సుమారుగా 50 కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ గురించి కూడా చర్చ నడుస్తోంది. దీనికి అనుగుణంగానే ఎంపురాన్‌ను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూస్తామా అని మోహన్ లాల్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎంపురాన్ డిజిటల్ రైట్స్‌ను ఏ సంస్థ దక్కించుకుంది? ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? అనే దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. భారీ అంచనాల నేపథ్యంలో ఎంపురాన్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం విపరీతమైన పోటీ నెలకొందట. ఓటీటీ సంస్థలు కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా మాలీవుడ్ టాక్.
M9 న్యూస్ నివేదించిన కథనం ప్రకారం ఎంపురాన్ ఓటీటీ రైట్స్ దక్కించుకునే విషయంలో .. ఓటీటీ దిగ్గజం జియో హాట్ స్టార్ ముందుందని విశ్లేషకులు చెబుతున్నారు. మోహన్ లాల్ మూవీని దక్కించుకునేందుకు సంప్రదింపులు జరుపుతుందట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఎంపురాన్ ఓటీటీకి అత్యధిక ధర పలికే అవకాశం ఉంది. ఇక ఓటీటీ నిబంధనల ప్రకారం .. థియేటర్‌లో రిలీజైన 5 నుంచి 7 వారాల తర్వాతే ఏ సినిమా అయినా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వాలి.
ఏప్రిల్ చివరి వారంలో కానీ , మే ఫస్ట్ వీక్‌లో కానీ ఎంపురాన్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మోహన్ లాల్ - పృథ్వీరాజ్ సుకుమారన్‌ల చిత్రాన్ని ఏ ఓటీటీ సంస్థ దక్కించుకుంది? ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











