Lost movie Review.. పింక్ డైరెక్టర్ మరో క్రైమ్ థ్రిల్లర్.. యామీ గౌతమ్ ఎలా చేసిందంటే?
నటీనటులు: యామీ గౌతమ్, పంకజ్ కపూర్, రాహుల్ ఖాన్నా, నీల్ భూపాలన్, పియా బాజ్‌పేయ్, తుషార్ పాండే తదితరులు
దర్శకత్వం: అనిరుధ్ రాయ్ చౌదరీ
రచన: శ్యామల్ సేన్ గుప్తా, రితీష్ షా
నిర్మాతలు: జీ స్టూడియోస్, నమా పిక్చర్స్
సినిమాటోగ్రఫి: అవిక్ ముఖోపాధ్యాయ్
ఎడిటింగ్: బోధాదిత్య బెనర్జీ
మ్యూజిక్: శంతను మోయిత్రా
బ్యానర్: జీ స్టూడియోస్
ఓటీటీ రిలీజ్: జీ6
రిలీజ్ డేట్: 2023-02-16
విధి సహాని (యామీ గౌతమ్) క్రైమ్ రిపోర్టర్. ఇషాన్ భారతీ (తుషార్ పాండే) అనే రంగస్థల నటుడు ఉన్నట్టుండి అదృశ్యమవుతాడు. తొలుత ఇషాన్ ప్రియురాలు అంకిత చౌహాన్ (పియా బాజ్‌పేయ్)పై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకుడు రంజన్ వర్మన్ (రాహుల్ ఖాన్నా) వ్యవహరించే తీరు అనుమానాస్పదంగా మారుతుంది. ఈ క్రమంలో ఇషాన్ భారతీ అదృశ్యం కేసును చేధించేందుకు విధి రిపోర్టింగ్ మొదలుపెడుతుంది.

అంకిత చౌహాన్, ఇషాన్ మధ్య రిలేషన్ ఎలాటింది? అంకిత, ఇషాన్ మధ్యలోకి పొలిటీషియన్ రంజన్ ఎలా దూరాడు? ఇషాన్ భారతీ ఎలా అదృశ్యమయ్యాడు? ఇషాన్ బతికి ఉన్నాడా? లేదా ఎవరైనా హత్య చేశారా? ఇషాన్ కనిపించకుడా పోయిన ఘటన వెనుక ఎవరి హస్తం ఉంది? ఇషాన్ భారతికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా? పొలిటీషియన్‌తో చేతులు కలిపిన అంకిత చౌహాన్ జీవితం ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుపోయింది. చివరకు ఇషాన్ భారతీ ఆచూకీ తెలిసిందా? అనే ప్రశ్నలకు సమాధానమే లాస్ట్ సినిమా కథ.
కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌తో అంకిత, ఇషాన్ ప్రేమ కథతో లాస్ట్ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ఇషాన్ కనిపించడం లేదనే విషయంపై తల్లి, చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ మొదలవుతుంది. క్రైమ్ రిపోర్టర్‌గా విధి కేసును పరిశోధించడం ద్వారా కథ ఆసక్తికరంగా ముందుకెళ్లుంది. అయితే కథలో సాగదీత, విధి సహాని వ్యక్తగత జీవితంలో సమస్యలు కథను నీరుగార్చినట్టు అనిపిస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌కు ముందు కథ వేగం పుంజుకొని.. ఓ మంచి సినిమాగా ముగింపు దొరుకుతుందని ఫీలింగ్ కలుగుతుంది. కానీ క్లైమాక్స్‌లో కాన్ ఫ్లిక్ట్‌కు ఎలాంటి పరిష్కారం చూపించకుండా వదలేయడం సినిమాకు ఉన్న పర్పస్ అర్ధమవ్వదు. సినిమా ముగింపు నిరాశనే మిగుల్చుతుంది.

పింక్ చిత్రాన్ని అందించిన దర్శకుడు అనిరుధ రాయ్ చౌదరీ లాస్ట్ సినిమాకు నిర్మాత. ఈ సినిమా పాయింట్ బాగుంది. కథను నడిపించిన తీరుపై కూడా ఎలాంటి అసంతృప్తి ఉండదు. కథలో ఉండే సమస్యకు చివర్లలో ఎలాంటి పరిష్కారం లేకుండా లూజ్ ఎండ్‌తో ముగించడం ప్రేక్షకులకు నిరాశను కలిగిస్తుంది. దర్శకుడు అనిరుధ.. క్రైమ్ జర్నలిజం, అలాగే ఒక విషయంపై రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉంటాయనే విషయాన్ని అర్ధవంతంగా చర్చించే ప్రయత్నం చేశారు. అయితే కథకు కావాల్సిన క్లారిటీని మిస్ చేయడం అంతుచిక్కని విషయంగా అనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. యామీ గౌతమ్ జర్నలిస్టుగా తన పాత్రలో ఒదిగిపోయింది. కీలక సన్నివేశాల్లో ఆమె బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకొనేలా ఉంటుంది. రాజీపడని జర్నలిస్టు పాత్రలో మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక పియా బాజ్‌పేయ్‌ది ఓ పెక్యులర్ క్యారెక్టర్. తన పాత్రలో పియా ఇంతకుముందు కంటే భిన్నంగా కనిపించింది. రాహుల్ ఖన్నా తనదైన శైలిలో సాఫ్ట్ విలనిజాన్ని చక్కగా పండించాడు. యామీ గౌతమ్ తాతగా పంకజ్ కపూర్ తన నటనతో ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో నటించిన వారు ఫర్వాలేదనిపిస్తారు

ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అవిక్ ముఖోపాద్యాయ్ సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. శంతను అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. బోధాదిత్య ఎడిటింగ్ విషయంలో ఏదో అసంతృప్తి ఉంటుంది. లెంగ్తీ సీన్లతో కొన్ని సార్లు విసిగించారా అనిపిస్తుంది. జీ స్టూడియో ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కథపై ఇంకా కాస్త కసరత్తు చేసి.. మీనింగ్ ఫుల్ ఎండింగ్ ఇచ్చి ఉంటే ఈ సినిమాకు పరమార్థం ఉండేదనిపిస్తుంది.
అక్రమాలు, అవినితీపై చైతన్యం కలిగించే అంశాలు, పోలీసు, రాజకీయ వ్యవస్థ, అలాగే మావోయిస్టుల సిద్దాంతాలు, ఇద్దరు వ్యక్తుల ప్రేమ, బాధ్యతాయుతమైన ఓ క్రైమ్ జర్నలిస్టు, తదితర అంశాలను జోడించిన చిత్రం లాస్ట్. అయితే కథలో బలమైన పాయింట్ లేకపోవడం, క్రైమ్ రిపోర్టింగ్ మెయిన్ అంశంగా సాగే ఈ సినిమాకు ముగింపు సరిగా ఇవ్వకపోవడం వల్ల లాస్ట్ ఓ సాధారణమైన సినిమాగా అనిపిస్తుంది. ఓటీటీ జీ5లో ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











