MAD OTT: ఆ ఓటీటీలోనే కడుపుబ్బా నవ్వించే మూవీ.. ఏంటి అన్ని రోజులకే స్ట్రీమింగా?
కాలేజ్ బ్యాగ్‌డ్రాప్‌తో సాగే ఫన్ ఎంటర్‌టైనర్ మూవీలు గతంలో చాలానే చూశాం. అయితే, ఇప్పుడు ఆ తరహా సినిమాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో అడపాదడపా అలాంటి కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'మ్యాడ్'. యూత్‌కు కనెక్ట్ అయ్యే కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని శుక్రవారమే ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమానే 'మ్యాడ్'. కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి యూఎస్‌లోని ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అలాంటిదే కనిపించింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కుతోంది. తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ బాగున్నాయి. దీంతో దీనికి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా 'మ్యాడ్' మూవీ ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మ్యాడ్' మూవీపై క్రమంగా అంచనాలు పెరిగాయి. దీంతో దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. అంటే అక్టోబర్ 6వ తేదీన విడుదలైన 'మ్యాడ్' నవంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.

ముగ్గురు యువ హీరోలు కలిసి నటించిన 'మ్యాడ్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ సమర్పణలో సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మేనియానే కనిపిస్తోంది. దీన్ని అందరూ 'జాతి రత్నాలు', 'హ్యాపీ డేస్' వంటి చిత్రాలతో పోలుస్తున్నారు.


Click it and Unblock the Notifications











