Malli Pelli OTT: ఫేమస్ ఓటీటీలో మళ్లీ పెళ్లి.. ఆ సీన్స్ కూడా సెన్సార్ లేకుండానే!
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయిన చిత్రాల్లో 'మళ్లీ పెళ్లి' ఒకటి. సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాను సీనియర్ దర్శకుడు ఎమ్మెస్ రాజు తెరకెక్కించారు. నరేష్ నిజ జీవిత సంఘటనలకు కొంత ఫిక్షనల్ కంటెంట్‌ను జోడించి ఈ సినిమాను రూపొందించారు. దీంతో ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వివాదాస్పద జంట నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రమే 'మళ్లీ పెళ్లి'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అలాంటి టాక్‌ను సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా చాలా తక్కువగానే వచ్చింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు పెద్దగా రాలేదు. పైగా చాలా ఏరియాల్లో జీరో షేర్‌తో షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో తాజాగా 'మళ్లీ పెళ్లి' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

వివాదాస్పద అంశాలతో రూపొందిన 'మళ్లీ పెళ్లి' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు కొనుగోలు చేసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. అందుకు తగ్గట్లుగానే మే 26న విడుదలైన 'మళ్లీ పెళ్లి' జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ తాజాగా ప్రకటించింది.
'మళ్లీ పెళ్లి' మూవీలోని చాలా వివాదాస్పద సన్నివేశాలను సెన్సార్ వాళ్లు కట్ చేశారు. ఇప్పుడు వాటిని కూడా యాడ్ చేసి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఇక, ఈ సినిమాను విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ నిర్మించారు. ఈ మూవీ తెలుగు, కన్నడ భాషల్లో రూపొందింది. దీనికి సురేష్ బొబ్బులి, అరుల్‌దేవ్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











