Dhootha Trailer: ట్విస్టులతో సర్‌ప్రైజ్ చేసిన నాగ చైతన్య.. ట్రైలర్ ఏముంది గురూ!
బడా ఫిల్మ్ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా చాలా వాటిలోనూ రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఆ మధ్య వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టిన అతడు.. కొంత కాలంగా ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడుతున్నాడు. అయినప్పటికీ ఎన్నో ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.
కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రయోగాలు చేస్తోన్న నాగ చైతన్య.. సినీ రంగంలో తనదైన మార్కును చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం ఈ యువ సామ్రాట్ 'ధూత' అనే వెబ్ సిరీస్‌ను చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ నిర్మించింది.

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన 'ధూత' వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని అత్యధిక బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను డిసెంబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
అక్కినేని నాగ చైతన్య నేడు (నవంబర్ 23వ తేదీ) పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీన్ని పురస్కరించుకుని అమెజాన్ ప్రైమ్ సంస్థ 'ధూత' వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇది ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే విధంగా కనిపించింది. ఇందులో నాగ చైతన్య క్రైమ్ జర్నలిస్టుగా కనిపించాడు. అతడు అనుకోకుండా కొన్ని మరణాలను చూడడం హైలైట్ చేశారు.
వరుసగా జరుగుతున్న హత్యలకు, హీరో పాత్రకు సంబంధం ఏంటి? అసలు పేపర్లో వచ్చిన కార్టున్ స్టోరీలా హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అనే అంశాలను సస్పెన్స్‌గా ఉంచి 'ధూత' సిరీస్‌పై అంచనాలు పెంచేశారు. ఇక, ఈ ట్రైలర్‌లో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ టాప్ రేంజ్‌లో ఉన్నాయి. అలాగే, నాగ చైతన్య లుక్స్ కూడా పాత్రకు తగ్గట్లుగానే ఉన్నాయని చెప్పాలి. మొత్తానికి ఈ ట్రైలర్‌కు విశేషమైన స్పందన వస్తోంది.
ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ధూత' వెబ్ సిరీస్‌లో అక్కినేని నాగ చైతన్యకు జోడీగా ప్రియ భవానీ శంకర్ నటిస్తోంది. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ సిరీస్ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.


Click it and Unblock the Notifications











