Unstoppable 2 కంగన రనౌత్‌కు పద్మశ్రీ అవార్డా? మాకు అర్హత లేదా? దక్షిణాదిపై వివక్ష.. జయసుధ, జయప్రద ధ్వజం
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ రియాలిటీ షో క్రేజీగా సాగుతున్నది. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ షోకు సంబంధించిన రెండో సీజన్ రంజుగా సాగుతున్నది. అయితే తాజా ఎపిసోడ్‌లో సీనియర్ నటులు జయసుధ, జయప్రద, రాశీఖన్నా గెస్టులుగా పాల్గొన్నారు. అయితే ఈ షోలో దక్షిణాది నటీనటులపై కొనసాగుతున్న వివక్షపై జయసుధ, జయప్రద ధ్వజమెత్తారు. మాలాంటి సీనియర్లకు పద్మ అవార్డు ఇవ్వకుండా.. కంగన రనౌత్ లాంటి హీరోయిన్లకు ఇవ్వడం సమంజసమేనా అని ప్రశ్నించారు. బాలకృష్ణ అడిగిన ఓ ప్రశ్నకు జయసుధ, జయప్రద ఎలా స్పందించారంటే?

కంగన రనౌత్‌కు పద్మశ్రీ అవార్డు
జయసుధ, జయప్రదను ఉద్దేశించి.. మీ కెరీర్‌లో ఎవరూ చేయనటువంటి పాత్రలు చేశావు. నీవు చేసిన తర్వాత అలాంటి పాత్రలు ఎవరూ కూడా అటెంప్ట్ చేయని విధంగా పాత్రలు పోషించావు. సినిమాల్లో పెరిగావు.. సినిమాల్లో జీవితం కొనసాగించావు. నిర్మాతగా సినిమాలు తీశావు. కానీ ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ అవార్డు రాలేదు. నిన్న మొన్న వచ్చిన కంగన రనౌత్‌కు పద్మ అవార్డు ఇచ్చారు. నీకు బాధ కలుగలేదా అని బాలకృష్ణ ప్రశ్నించాడు.

దక్షిణాది నటీనటులపై వివక్ష
అయితే నేను జయప్రద, మేము యంగ్‌గా ఉన్నప్పుడు.. కెరీర్ ప్రారంభించినప్పుడు చాలా సినిమాలు, విభిన్నమైన పాత్రలు పోషించుకొంటూ వెళ్లాం. అయితే కంగన రనౌత్ విషయానికి వస్తే.. ఆమె అమేజింగ్ యాక్టర్. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పది సినిమాలు చేసిన ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి.. మాకు ఇవ్వకపోవడం బాధ కలిగించే అంశం. మాకు ఎంతో సీనియారిటి ఉంది. మాకు ఎన్నో పాత్రలు పోషించాం. దక్షిణాదిలో ఉన్న నటీనటులకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లేదు అని జయసుధ అన్నారు.

శారద, విజయనిర్మలకు అర్హత లేదా?
అయితే నాకు పద్మశ్రీ అవార్డు రావడం లేదని నేను ఫిర్యాదు చేయడం లేదు. దక్షిణాదిలో శారద, సావిత్రి, విజయ నిర్మల లాంటి వాళ్లు ఎంతో గొప్పగా నటించారు. అద్బుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరింప చేశారు. దక్షిణాది నటీనటులపై వివక్ష ఎందుకు అర్ధం కాదు. విజయనిర్మల నటిగా, దర్శకురాలిగా 48 సినిమాలకు దర్శకత్వం వహించారు. విజయ నిర్మల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. అలాంటి ఆమెను గుర్తించకపోవడం చాలా దారుణం అని జయసుధ అన్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని
అయితే పద్మశ్రీ అవార్డు రాకపోవడంపై జయప్రద స్పందిస్తూ.. మేము అడిగి తీసుకోవడం మాకు ఇష్టం లేదు. మా ప్రతిభను, మా సినియారిటీ గుర్తించి గౌరవించాలని అనుకొన్నాం. అడిగి అవార్డులు తీసుకోవడం మాకు ఇష్టం ఉండదు. నేను ఎంపీగా ఉన్న సమయంలో స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పలుమార్లు దరఖాస్తు చేశాను. కానీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినా నా ప్రయత్నాలను ఆపలేదు అని జయప్రద అన్నారు.

జయసుధ, జయప్రదతో బాలయ్య చిలిపిగా
అయితే ఇలాంటి సీరియస్ టాపిక్స్‌తోపాటు జయప్రద, జయసుధతో సరదాగా చిలిపిగా ప్రశ్నలు అడుగుతూ అన్ స్టాపబుల్ 2 తాజా ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మార్చారు. వారిద్దరిని ఉద్దేశించి.. మీరు ఇద్దరు డ్యాన్సర్లు. మీతో డ్యాన్స్ చేయలేకపోయాను. ఇప్పుడు నాతో మీరిద్దరూ డ్యాన్స్ చేస్తారా? అని అడగ్గానే.. జయప్రద, జయసుధ వచ్చి.. ఇరువురి భామల నడుమన పాటపై స్టెప్పులేసి ప్రేక్షకులను, అభిమానులను అలరించారు.


Click it and Unblock the Notifications











