ఒక్క టెస్ట్, ముగ్గురి జీవితాలు.. ఓటీటీలోకి నయనతార మూవీ .. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
లేడీ సూపర్‌స్టార్ నయనతార వరుస సినిమాలతో దుమ్మురేపుతున్నారు. సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా, స్టార్స్‌ను మించిన క్రేజ్‌తో దూసుకెళ్తున్నారు. ఆమె నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుండటంతో నయన్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. గ్లామర్ షోకు దూరంగా కథాబలమున్న పాత్రలనే పోషిస్తూ సినిమాపై తన ముద్ర వేస్తున్నారు నయనతార. వరుస విజయాలు, వివాదాలతో ఆమె తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు.
ఇటీవల నయనతార - ధనుష్ మధ్య చోటు చేసుకున్న కాపీ రైట్ వివాదం చిత్ర పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినీ పెద్దలు రంగంలోకి దిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తాజాగా నయనతార నటించిన చిత్రం టెస్ట్. సీనియర్ హీరో మాధవన్, సిద్దార్థ్, మీరా జాస్మిన్, కాలి వెంకట్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఎస్ శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గోపాలన్ స్వరాలు అందించగా.. వైనాట్ స్టూడియోస్ నిర్మించింది. దర్శకుడు శశికాంత్‌కు ఇదే తొలి సినిమా. ఇక దాదాపు పదేళ్ల తర్వాత సీనియర్ నటి మీరా జాస్మిన్ ఓ తమిళ చిత్రంలో నటిస్తుండటం విశేషం.

సిద్ధార్ధ్, మాధవన్‌లు గతంలో ఆయుథ ఎజుత్తు, రంగ్ దే బసంతే సినిమాల తర్వాత దాదాపు 18 ఏళ్లకు కలిసి ఒకే సినిమాలో నటించడం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలను తీసుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్స్ టెస్ట్ మూవీపై హైప్ తీసుకొచ్చింది. ది ఫ్యామిలీ మెన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు కథను అందించిన సుమన్ కుమార్ రాసిన ఓ కథ ఆథారంగా టెస్ట్ సినిమాను తెరకెక్కించారు.
చెన్నై క్రికెట్ స్టేడియంలో భారత జట్టు ఓ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ కారణంగా ముగ్గురి జీవితాలు ప్రభావితమవుతాయి? క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన వారు ఎలా చిక్కుల్లో పడ్డారు? వాటిని ఎలా అధిగమించారు? అన్నది ఈ సినిమాలోనే చూడాలి. నటనపరంగా నయన్, మాధవన్ , సిద్ధార్థ్‌లు అనుభవజ్ఞులు కావడంతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. లవర్ బాయ్ , ఫ్యామిలీమెన్ ఇమేజ్ ఉన్న మాధవన్ గత కొన్నేళ్లుగా ఓటీటీలు, వెబ్ సిరీస్‌లలోనే ఎక్కువగా నటిస్తున్నారు. వాటిలో చాలా వరకు హిట్ అయ్యాయి.

2024 ప్రారంభంలోనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే అనివార్య కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే సినిమాను స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 4 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో టెస్ట్ మూవీ అందుబాటులో ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











