Thug Life OTT Business: ఓటీటీ రైట్స్‌లో కమల్ కొత్త రికార్డు.. థగ్‌లైఫ్ హక్కులు ఎవరికి? ఎన్ని కోట్లంటే?
యూనివర్సిల్ స్టార్ కమల్ హాసన్ ఈ ఏజ్‌లోనూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే కల్కి 2898 ఏడీలో సుప్రీం యాస్కిన్‌గా తన విలక్షణ నటనతో ప్రేక్షకులను భయపెట్టారు కమల్. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఆయన థగ్ లైఫ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ వంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత మణిరత్నం టేకప్ చేస్తున్న సినిమా కావడంతో థగ్‌లైఫ్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే..
నటనకు పర్యాయపదం లాంటి కమల్ హాసన్ హిట్ కొట్టి చాలా ఏళ్లే అవుతుంది. ఏ సినిమా చేసినా ఫ్లాప్ కావడంతో పాటు రాజకీయాల్లోకి వెళ్లి ఆయన చేతులు కాల్చుకున్నారు. పాలిటిక్స్ మనకి సరిపడవని వెంటనే గ్రహించి బుద్ధిగా సినిమాలు చేసుకుంటున్నారు. అలాంటి దశలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ ద్వారా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కమల్. అది అలాంటి ఇలాంటి హిట్ కాదు.. రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తమిళ పరిశ్రమను మళ్లీ నిలబెట్టింది.

ఇక మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీలో సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో కమల్ జీవించారు. ఆ గెటప్‌లో ఆయన భయపెట్టారు.. పార్ట్ 1లో కొద్దిసేపే కనిపించినా ఉన్నంతసేపూ ఒక ఊపు ఊపారు. ఇక భారతీయుడికి సీక్వెల్‌గా ఎన్నో అంచనాల మధ్య రిలీజైన భారతీయుడు -2 కమల్ హాసన్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. తన పరిధి మేరకు సినిమాను మోసేందుకు ఆయన ప్రయత్నించినా ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో శంకర్, కమల్ హాసన్ కెరీర్‌లో భారీ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా మణిరత్నంతో దాదాపు 36 ఏళ్ల తర్వాత థగ్ లైఫ్ అనే సినిమాలో కమల్ నటిస్తున్నారు. ఇది ఈ దిగ్గజ నటుడి కెరీర్‌లో 234వ చిత్రం.
ఇందులో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్‌స్టర్, క్రిమినల్‌గా డ్యూయెల్ రోల్ పోషించనున్నారని కోలీవుడ్ టాక్. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. శింబు, అశోక్ సెల్వన్, పంకజ్ త్రిపాఠి, జొజు జార్జ్ , అభిరామి, నాజర్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న థగ్‌లైఫ్‌ను ఈ ఏడాది నవంబర్‌లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ సినిమాపై భారీ అంచనాలు నేపథ్యంలో థగ్‌లైఫ్ డిజిటల్ రైట్స్‌కు భారీ డిమాండ్ నెలకొంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దాదాపు రూ.149.7 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కమల్ గత చిత్రం విక్రమ్‌తో పోలిస్తే ఇది తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు. విక్రమ్ ఓటీటీ, టీవీ శాటిలైట్ రైట్స్ దాదాపు రూ. 200 కోట్లకు అమ్ముడై రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇళయ దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (ది గోట్) కంటే (రూ.110 కోట్లు) థగ్‌లైఫ్ ఓటీటీ రైట్స్‌కు భారీ ధర పలికినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











